
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన 42 మంది వైద్యుల బదిలీ ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. వైద్యుల బదిలీపై తనకు సమాచారం లేదని, అందుకు ఆ బదిలీలను రద్దు చేస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ముగియక ముందే మమతా బెనర్జీ ప్రభుత్వం భారీ స్థాయిలో డాక్టర్లను బదిలీ చేయడంతో దుమారం చెలరేగింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో పనిచేస్తున్న 42 మంది ప్రొఫెసర్లు, వైద్యులను బదిలీ చేశారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కాగా, ఒకవైపు మహిళా డాక్టర్ హత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో మమతా బెనర్జీ ప్రభుత్వం వైద్యులను బదిలీ చేయడంపై డాక్టర్ల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. నిరసనకు మద్దతు ఇచ్చిన ఫ్యాకల్టీ సభ్యులను అన్యాయంగా బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ పేర్కొంది.
తమ పోరాటంలో ఐక్యంగా, దృఢంగా నిలుస్తామని ట్వీట్ చేసింది యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్. డాక్టర్ల బదిలీలు ఒక కుట్ర అని, సీనియర్ వైద్య నిపుణులను ‘భయపెట్టే’ ప్రయత్నమని మమత సర్కారుపై మండిపడింది. వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో ఆసుపత్రికి చెందిన 42 మంది డాక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది.
“ఆగస్టు 16న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వశాఖ 8 పేజీల సుదీర్ఘ బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇప్పటివరకు ఈ రెండు సంస్థల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లను సిలిగుడి, తమ్‌లుక్, ఝర్‌గ్రామ్ కళాశాలలకు బదిలీ చేశారని, దీని ద్వారా సీనియర్ వైద్యుల సంఘాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ నిరసనల్లో పాల్గొంటున్న ప్రజలకు , జర్నలిస్ట్‌లకు నోటీస్‌లు పంపుతోందని, క్రైమ్‌సీన్‌ను నాశనం చేయడానికి 5000 మంది గూండాలను పంపిందని, 43 మంది వైద్యులను బదిలీ చేసిందని, ఇది డాక్టర్లపై ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత , బెదిరింపు చర్య” అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం అంటూ తిరిగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు