
* ప్రాంతాల వారీగా సభ్యత్వ ఇన్ ఛార్జ్ ల నియామకం
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి సభ్యత్వ సేకరణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. మూడు నెలలపాటు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 10 కోట్ల మంది సభ్యులను చేర్పించాలని నిర్ణయించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ కార్యక్రమం జరగదు. సభ్యత్వ సేకరణకు ప్రాంతాల వారీగా పార్టీ ప్రముఖులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు.
ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన అత్యున్నత సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ పార్టీ సిద్ధాంతాలను దేశం నలుమూలలకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులను ఉద్బోధించారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలకు బలమైన ప్రాతిపదిక ఏర్పడగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తూనే, రాష్ట్రాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై తమ విశ్వాసాన్ని పదేపదే వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. బిజెపి బలమైన భావజాలంతో నడిచే క్యాడర్ ఆధారిత పార్టీ అని చెబుతూ పార్టీని విస్తరించేందుకు నిరంతరం జరుపుతున్న కృషి కారణంగానే 1984 లో గెలిచిన కేవలం రెండు లోక్‌సభ స్థానాల నుండి జాతీయ రాజకీయాల్లో ప్రస్తుత అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లిందని అమిత్ షా స్పష్టం చేశారు.
ఈ సభ్యత్వం పూర్తయిన తర్వాత బీజేపీ మొత్తం సభ్యత్వం 18 కోట్లకు చేరుకోగలదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు. కనీసం సగం రాష్ట్రాల్లో సభ్యత్వ కార్యక్రమం ముగిసిన తర్వాతనే పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా అధ్యక్షత వహించగా, పార్టీ జాతీయ పదాధికారులు, రాష్ట్ర ముఖ్య సంస్థాగత నేతలు హాజరయ్యారు. సభ్యత్వ సేకరణకు ఇది శిక్షణ వర్క్‌షాప్ లాంటిదని, ఈ పక్రియ దేశంలో అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు విస్తరిస్తోందని సంబిత్ పాత్ర స్పష్టం చేశారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ సభ్యత్వ కార్యక్రమానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని, పార్టీ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పాత్రా తెలిపారు. త్వరలో ప్రకటించబోయే మొబైల్ నంబర్‌కు కాల్ చేయడం, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం, నమో యాప్ ద్వారా, బీజేపీ వెబ్‌సైట్ ద్వారా నాలుగు పద్ధతుల ద్వారా కొత్త సభ్యులను చేర్చుకుంటామని పాత్రా చెప్పారు.
అయితే, మారుమూల ప్రాంతాల్లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి పార్టీ సంప్రదాయ పేపర్ పద్ధతిని ఉపయోగిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సభ్యత్వ ప్రచార ఇన్‌ఛార్జ్‌లను బీజేపీ నియమించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, డామన్ డయ్యూ మరియు దాద్రా నగర్ హవేలీలకు బిజెపి సీనియర్ నాయకుడు వినోద్ తావ్డే సభ్యత్వ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, త్రిపుర, ఒడిశాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, లడఖ్, చండీగఢ్‌లలో సభ్యత్వ ప్రచార కార్యక్రమాన్ని చూస్తారు. డి పురందేశ్వరి కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులకు కాగా, అరవింద్ మీనన్ అండమాన్, నికోబార్, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, తెలంగాణలకు, రితురాజ్ సిన్హా ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు, ఘజియాబాద్ ఎంపీ అతుల్ గార్గ్ ఉత్తరాఖండ్, బీహార్‌లకు సభ్యత్వ ప్రచారానికి, ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు