భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పారిస్ నుంచి భారత్ చేరుకున్నారు. శనివారం ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే రెజ్లర్‌కు ఘన స్వాగతం లభించింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరినా కూడా పతకం రాలేదనే బాధ వినేష్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.
అయినా ఆమెకు మెడల్ గెల్చుకు వచ్చిన వారికి లభించిన విధంగానే స్వాగతం లభించింది. చాలా రోజుల తర్వాత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్దకు వెళ్లారు. వారిని చూసిన వినేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకొని బాగా ఏడ్చింది.
ఈ క్రమంలో వినేష్‌కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. వినేష్ బయటకు రాగానే ఇద్దరూ ఆమెను కౌగిలించుకున్నారు. ఆ సమయంలో వినేష్ ఇద్దరినీ కౌగిలించుకుని ఏడ్చేసింది. ఆమె బజరంగ్, సాక్షితో కలిసి కారుపై నిలబడి ఏడుస్తూనే ఉన్నారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన క్రమంలో వినేష్ ఫోగట్ మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. “మా పోరాటంలో మాకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మా పోరాటం ఇంకా ముగియలేదు ” అని చెప్పారు.
వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినప్పటికీ ఆమె ఖచ్చితంగా ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుదని చెప్పవచ్చు. ఈ కారణంగానే వినేష్‌కి ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే వినేష్ అభిమానులందరికీ ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలిపారు.
వినేష్ ఎప్పటికీ ఫైటర్‌గానే ఉంటుందని ఈ సందర్భంగా సాక్షి మాలిక్ భర్త, రెజ్లర్ సత్యవరత్ కడియన్ తెలిపారు. తమకు ఛాంపియన్ అవడానికి ఉన్న ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టమబోమని స్పష్టం చేశారు. ఆమెను ఇప్పటికీ గోల్డ్ మెడలిస్ట్‌గా పరిగణిస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినేష్ దేశం కోసం ఏం చేయాలో అంత చేసిందని రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇలా చేయగలరని చెప్పారు. పతకం కోసం తన శాయశక్తులా ప్రయత్నించారని వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో వినేశ్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంగా ఫైనల్‌కు కొన్ని క్షణాల ముందు రెజ్లర్‌పై అనర్హత వేటు పడింది. దీంతో యావత్తు భారత దేశం తీవ్ర నిరాశ చెందింది. ఇక తన ‘అనర్హత వేటు’పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)ను వినేశ్ ఆశ్రయించగా.. అక్కడా నిరాశే ఎదురైంది.
ఈనెల 16న తీర్పు వెలువరించాల్సి ఉన్నా 14వ తేదీ రాత్రి ఉన్నఫళంగా ఆమె పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ప్రకటించడం భారత క్రీడాభిమానులను నివ్వెరపోయేలా చేసింది. కారణాలేమీ చెప్పకుండానే ‘సింగిల్ లైన్ ఆర్డర్’తో కాస్ వెలువరించిన ప్రకటన అనంతరం ఆమెకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల అనంతరం వినేశ్ తొలిసారి భారత్ చేరుకున్నారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు