ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ – భీమ్‌సేన్ రైల్వే స్టేషన్ పరిధిలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైలు వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రట్టాలపై పెట్టిన ఓ వస్తువును రైలు ఇంజిన్ ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణం అని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంజిన్ ముందు భాగం దెబ్బతిందని, రైలు పట్టాలు తప్పడం వల్ల ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో మూడు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాద ఘటనపై పోలీసులు, ఐబీ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. ఇంజిన్ ఢీకొన్న వస్తువు అధికారులు భద్రపరిచారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రయాణికులందరినీ మరో రైలులో గమ్యస్థానాలకు చేర్చింది.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, రైలు ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అంటూ ఆందోళనతో రైలు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ప్రయాణికులంతా తమ సామాన్లతో రైలు పట్టాల వద్దే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
“ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి కాన్పుర్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశాం. రైలు ప్రయాణికులను తరలించడానికి కాన్పూర్ నుంచి ప్రమాద స్థలానికి ఎనిమిది కోచ్‌ల ఎంఈఎంయు రైలు బయలుదేరింది” అని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శశి కాంత్ త్రిపాఠి పేర్కొన్నారు.
ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెల్లవారుజామున 2.35 గంటలకు కాన్పూర్ సమీపంలో ట్రాక్‌పై ఉన్న ఓ వస్తువును ఇంజిన్ ఢీకొట్టడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందన్నారు. ట్రాక్‌పై పదునైన గుర్తులు కనిపించాయని వెల్లడించారు. ఆధారాలను భద్రపరిచామని తెలిపారు. ఐబీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బంది, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి మరో రైలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
More Stories
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి