గవర్నర్ అనుమతితో సిద్దరామయ్య అరెస్ట్ తప్పదా!

గవర్నర్ అనుమతితో సిద్దరామయ్య అరెస్ట్ తప్పదా!
 
* కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ముడా కేసు
 
మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో కర్ణాటక సిద్ధరామయ్య అరెస్ట్ తప్పకపోవచ్చని ఆ రాష్ట్ర రాజకీయాలలో కలకలం చెలరేగుతోంది. గతంలో గవర్నర్ ఆమోదం తెలిపిన అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు అరెస్ట్ కావడంతో ప్రస్తుతం కర్ణాటక సీఎం కూడా అరెస్ట్ అవుతారానే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
 
ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి భార్య బీఎం పార్వతి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. మైసూర్‌లో అక్రమంగా భూములు సేకరించారని సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయి. గత నెల రోజులుగా ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది.  తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం గవర్నర్‌కు పిటీషన్ దాఖలు చేశారు.
 
సామాజిక కార్య‌క‌ర్త‌లు ప్ర‌దీప్ కుమార్‌, టీజే అబ్ర‌హం, స్నేహ‌మ‌యి కృష్ణ అభ్య‌ర్థ‌న‌ల మేర‌కు విచార‌ణ కోసం ఆదేశాలు ఇచ్చారు. భార‌తీయ నాగ‌రికా సుర‌క్షా సంహితలోని సెక్ష‌న్ 17, సెక్ష‌న్ 218 కింద విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో.. ఇవాళ సాయంత్రం ప్ర‌త్యేక క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేశారు.

సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. ఈ కేసును చట్టబద్ధంగా తాము ఎదుర్కొంటామని, అందుకు అవసరమైన సన్నాహకాలు చేశామని చెప్పారు. సిద్ధరామయ్యకు బాసటగా కాంగ్రెస్ పార్టీ, అధిష్ఠానం, యావత్ రాష్ట్రం, మంత్రివర్గం నిలబడుతుందని స్పష్టం చేశారు.

”మేము సిద్ధరామయ్యకు అండగా ఉంటాం. చట్టపరంగా, రాజకీయంగా కూడా పోరాడతాం. సీఎంకు వ్యతిరేకంగా ఇచ్చిన నోటీసు, అనుమతులు పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రభుత్వాన్ని రెండోసారి నడుపుతున్న సిద్ధరామయ్య వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఈ కుట్ర జరుగుతోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది” అని డీకే శివకుమార్ తెలిపారు.

తాజాగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల ముందు తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

గతంలో  దాణా కుంభకోణంలో1997లో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆరోపణలు రావడంతో  గవర్నర్ ఏఆర్ కిద్వాయ్ లాలూ యాదవ్‌పై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీఐ ప్రారంభించి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన తర్వాత లాలూ తన భార్య రబ్రీదేవికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు.

2011లో సంతోష్ హెగ్డే నేతృత్వంలోని లోకాయుక్త కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై  అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపణలు చేయడంతో  యడియూరప్పపై విచారణకు గవర్నర్ భరద్వాజ్ ఆమోదం తెలిపారు. 2011 అక్టోబర్‌లో యడ్యూరప్పను అరెస్టు చేయాల్సి వచ్చింది. అరెస్ట్ తర్వాత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఈ కేసులో 23 రోజుల పాటు జైలులో ఉన్నారు. 

2022లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేజ్రీవాల్ ప్రభుత్వ మద్యం పాలసీపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో ఈ కేసులో  తొలుత మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆ తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. 

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడాపై  మైనింగ్ స్కాం ఆరోపణలపై  2009లో కోడా కేసులో సీబీఐ, ఈడీ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. విచారణలో కోడాను సీబీఐ అరెస్ట్ చేసింది. 2012 వరకు ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో అతనికి 2017లో శిక్ష పడింది. ప్రస్తుతం మధు కోడా భార్య రాజకీయాల్లో ఉన్నారు.

2021లో ముడా అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయనగర్‌లో భూమిని కేటాయించారు. విజయనగరంలో భూమి ధర కేసరెలో భూమి కంటే చాలా ఎక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో ముడా ద్వారా ఈ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి.

అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య యాజమాన్యాన్ని వెల్లడించడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని ఆర్టీఐ కార్యకర్త అబ్రహం తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవానికి ముడా  కర్ణాటక రాష్ట్ర స్థాయి అభివృద్ధి సంస్థ. పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఏజెన్సీ పని. దీంతో పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించాలి. కానీ సీఎం భార్యకు ఎక్కువ ధర ఉన్న భూమిని అప్పగించడంపై బీజేపీతోపాటు పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.