2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌

2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌

భారత్‌ వృద్ధి రేటు ఆశించిన దాని కన్నా మెరుగ్గా ఉందని, 2027 నాటికి  ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌ అవతరిస్తుందని ఐఎంఎఫ్‌ తొలి డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గీతా గోపీనాధ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ అంచనాలకు మించి వృద్ధి రేటు నమోదు చేసిందని తెలిపారు. ప్రైవేట్‌ వినిమయం కూడా పుంజుకుంటున్నదని పేర్కొన్నారు.

రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి భారత్‌ వృద్ధి రేటు అంచనాను 7 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఆర్ధిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం అంచనాలు 6.5 శాతం కంటే ఐఎంఎఫ్‌ వృద్ధి రేటు అంచనా అధికం కావడం గమనార్హం.  2027 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 

గత ఏడాది ప్రైవేట్‌ వినిమయ వృద్ధి 4 శాతం కాగా, గ్రామీణ వినిమయంలో పెరుగుదలతో ఈ ఏడాది ప్రైవేట్‌ వినిమయం మెరుగవుతుందని అంచనా వేస్తున్నామని గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు వివరాలు వెల్లడించారు. ద్విచక్ర వాహన విక్రయాలు, కన్జూమర్‌ గూడ్స్‌ విక్రయాలు ఊపందుకోవడం గమనించవచ్చని చెప్పారు. 

రుతుపవనాలు సానుకూలంగా ఉండటంతో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ ఆదాయాలు పెరిగితే గ్రామీణ వినిమయం ఊపందుకుంటుందని చెప్పారు. ఈ కారణాలతో తాము భారత వృద్ధి రేటును అప్‌గ్రేడ్‌ చేశామని గీతా గోపీనాధ్‌ వివరించారు.