ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు

ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను విక్రయించే అవకాశాన్ని ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వారా చిల్లర కష్టాలకు పూర్తిస్థాయిలో చెక్ పడనుంది.

ఇంతకుముందే క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేసే విధానాన్ని ప్రయోగత్మకంగా పలు స్టేషన్లలోని కౌంటర్లలో ప్రవేశపెట్టింది. దీంతో ఆశించిన ఫలితాలు రావటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో రైల్వే టికెట్‌ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు మరింత సులభతరం కానుంది.

తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్లలో క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్‌ చెల్లింపులు చేసేయవచ్చు. అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూపీఐ యాప్స్‌ వినియోగించి సింపుల్ గా డబ్బులను చెల్లించి టికెట్లను పొందవచ్చు. పేమెంట్ పూర్తి కాగానే టికెట్ అందజేస్తారు.

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది రైల్వే శాఖ. జనరల్ బుకింగ్కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఈ విధానం ద్వారా ప్రధానంగా చిల్లర సమస్యలకు చెక్ పడినట్లు అయింది. 

తొలి దశలో భాగంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్,  సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విజయవంతం కావటంతో జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకు విస్తరింపజేశారు. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపారు. మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.