ఖనిజాలు, ఖనిజ నిల్వలు ఉన్న భూములపై 2005 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం వసూలు చేసిన పన్నులు, రాయల్టీని వాపస్ చెల్లించమని రాష్ర్టాలు అడగొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
2026 ఏప్రిల్ 1 నుంచి 12 ఏండ్ల పాటు విడతలవారీగా ఈ పన్ను బకాయిలను కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తిరిగి పొందొచ్చని రాష్ర్టాలకు అనుమతిచ్చింది. అదే సమయంలో వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది. ఖనిజాలు, ఖనిజ వనరులు ఉన్న భూములపై రాయల్టీ, పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ర్టాలకు ఉందని జూలై 25న రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అంతకుముందు ఈ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని 1989లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకుపెట్టింది. ధర్మాసనం 1957 నాటి మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) చట్టం నుండి స్వతంత్రంగా మైనింగ్ భూములు, క్వారీలపై పన్ను విధించే రాష్ట్రాల అధికారాన్ని సమర్థించింది. ఖనిజాలపై పన్ను విధించడంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించింది.
ఫెడరలిజం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా పన్నులు విధించే రాష్ట్రాల హక్కులను రక్షించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అయింది. ఈ తీర్పును 1989 నుంచి వర్తింపజేయాలని, గనులు, ఖనిజాలపై అప్పటి నుంచి కేంద్రం నుంచి విధించిన రాయల్టీ సొమ్మును వాపస్ ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
రాయల్టీ వాపస్ ఇస్తే ఒక్క ప్రభుత్వరంగ కంపెనీలే రూ. 70 వేల కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తుందని, అలా చేయడం ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్యు)లకు తీరని దెబ్బ అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు తెలిపారు. అంతేగాక ఖజానా ఖాళీ అయి, పౌరులపై అధిక ధరల భారం పడుతుందని వివరించారు.
దీనిపై ఇటీవల వాదనలు పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసి బుధవారం వెల్లడించింది. ఈ తీర్పుతో ఒరిస్సా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు భారీ లబ్ధి చేకూరనుంది. 2005 ఏప్రిల్ 1 నుంచి గనులు, ఖనిజ వనరులపై కేంద్రం తీసుకున్న పన్నులను రాష్ర్టాలు తిరిగి పొందవచ్చని పేర్కొన్నది.
కాగా, తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుపై తనతో సహా ఎనిమిది మంది న్యాయమూర్తులు సంతకం చేస్తారని, జూలై 25న భిన్నమైన తీర్పు ఇచ్చిన జస్టిస్ నాగరత్న మాత్రం సంతకం చేయరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇప్పటినుంచి వీటిపై పన్ను విధించే అధికారం రాష్ర్టాలకు రానుండటంతో పాటు గత 19 ఏండ్లుగా కేంద్రం వసూలు చేసిన పన్నులను కూడా తిరిగి పొందే అవకాశం రావడంతో భారీగా నిధులు అందనున్నాయి.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం