జమ్మూ కశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్

జమ్మూ కశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్
ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు తరచు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనుంది. అలాంటి వేళ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ రాష్ట్ర డీజీపీగా  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి నళిన్ ప్రభాత్‌ను నియమించింది.

అక్టోబర్ 1వ తేదీన ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపింది. ఈ ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయన జమ్మూ కశ్మీర్‌ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతారని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఆ రాష్ట్ర ప్రస్తుత డీజీపీ ఆర్ ఆర్ స్వైన్ సెప్టెంబర్ 30వ తేదీన రిటైర్ కానున్నారు.  ఈ నేపథ్యంలో ఆ పదవిలో నళిన్ ప్రభాత్‌ను నియమించింది.

ఈ మేరకు గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొంది. 1992 బ్యాచ్ ఐపీఎస్ నళీని ప్రభాత్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల ఎస్పీగానే కాకుండా గ్రేహౌండ్స్‌లో సైతం పని చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు ఆయన అవలంభించిన విధి విధానాల పట్ల కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపించింది.

ఆ క్రమంలో పలు పోలీస్ పతకాలను సైతం నళిన్ ప్రభాత్ అందుకున్నారు. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) డైరెక్టర్ జనరల్‌గా ఆయన కొనసాగుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన నళిన్ ప్రభాత్‌‌ను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌లో మూడేళ్లు పని చేసేందుకు అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) బుధవారం నిర్ణయించింది.

2024, జూన్ 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు ఊపందుకున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడుల్లో భారత సైన్యానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, సైనికులు మృతి చెందుతున్నారు.

అలాంటి వేళ రాష్ట్రంలో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆ రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ నిర్వహించారు. ఆ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. దీంతో ఉగ్రవాద చర్యలు నిర్మూలనకు కఠిన చర్యలు అవలంభించాలని ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ ఉన్నతాధికారులకు అమిత్ షా ఆదేశించారు.

మరోవైపు ఆర్టికల్ 370 రద్దు అనంతరం సెప్టెంబర్ 30వ తేదీ లోపు జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా మరో వారం పది రోజుల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం పంపిందనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది.