కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం?

కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం?
కోల్‌కతలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో హత్యకు గురైన 31 సంవత్సరాల సోస్టు గాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టు మార్టమ్ నివేదిక సూచిస్తోందని ప్రభుత్వ వైద్యుల సంఘం అఖిల భారత సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి వెల్లడించారు. ట్రెయినీ డాక్టర్ శరీరంపై ఉన్న గాయాలను బట్టి అవి ఒక వ్యక్తి వల్ల అయ్యేవి కావని అర్థమవుతుందని ఆయన చెప్పారు.

తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు మృతురాలి తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలకత్తా హైకోర్టుకు వారు తెలిపినట్లు సమాచారం. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు శవపరీక్షలో తేలిందని, అందువల్ల ఒకరి కంటే ఎక్కువ మందే లైంగిక దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించారు.

అయితే, పోలీసులు ఒకరిని మాత్రమే నిందితుడిగా పేర్కొంటున్నారు.  గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉండటమే కాకుండా లైంగికదాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు మృతురాలి తల్లిదండ్రులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండు చెవులతోపాటు పెదవులపైన కూడా గాయాలు ఉన్నాయని చెప్పారు. మెడపై కొరికిన గాయాలు దాడి తీవ్రతను చాటుతున్నాయని తెలిపారు. 

అయితే తమ కుమార్తెపై సామూహిక హత్యాచారం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ మిగతావారిని అరెస్ట్‌ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ విచారణ ప్రారంభించింది. భారత న్యాయసంహిత ప్రకారం వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఆర్ఐ నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిల్లీ నుంచి వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన సీబీఐ బృందం కోల్కతా వెళ్లింది. సీబీఐ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఒక బృందం ఆర్జీ కార్‌ ఆస్పత్రిని సందర్శించి ఘటన జరిగిన రోజురాత్రి విధుల్లో ఉన్న డాక్టర్లు, సాక్ష్యులను కలిసి మాట్లాడింది. మృతురాలితోపాటు ఆరోజు విధుల్లో ఉన్న వైద్యుల కాల్‌ లిస్టు తీసుకున్నారు. రెండోబృందం ఈ కేసులో అరెస్టయిన సివిల్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ఎఫ్ఆర్ఐను సమర్పించింది. నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసింది. మూడో బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బంగాల్ పోలీసులతో సమన్వయం చేయనుంది.

కాగా, ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు బాధితురాలిపై క్రూరమైన దాడికి పాల్పడ్డాడని, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలైనట్టు తేలింది. అదేవిధంగా తనపై లైంగిక దాడిని బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పెనుగులాట చోటుచేసుకొన్నట్టు పోస్టుమార్టం నివేదిక చెబుతున్నది. 
 
ముఖంపై రక్తపు గాయాలున్నాయని, కండ్లలో నుంచి రక్తసావ్రం అయిందని, బాధితురాలి జననాంగాల్లో తీవ్రమైన గాయం అయినట్టు తేలింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో బాధితురాలు మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.