నలుగురికి కీర్తి చక్ర.. 18 మందికి శౌర్య చక్ర

నలుగురికి కీర్తి చక్ర.. 18 మందికి శౌర్య చక్ర
* ఉగ్రవాదులతో పోరులో మరణించిన మన్‌ప్రీత్‌ సింగ్‌
 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 103 మందికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదం తెలిపారు. ఇందులో నాలుగు కీర్తి చక్ర, 18 శౌర్య చక్ర పురస్కారాలు కాగా, 63 సేనా పతకాలు(శౌర్య), 11 నౌ సేనా పతకాలు, ఆరు వాయు సేనా పతకాలు ఉన్నాయి. 
 
మరణానంతరం ముగ్గురికి కీర్తి చక్ర పురస్కారాలు, నలుగురికి శౌర్య చక్ర దక్కనున్నాయి. సైనిక ఆపరేషన్‌లలో విశేష సేవలు అందించినందుకు గానూ 39 మెన్షన్‌ ఇన్‌ డిస్పాచ్‌లకు సైతం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇందులో మరణించిన సైనిక జాగిలం కెంత్‌ కూడా ఉంది.  పతకాలు, పురస్కారాల స్థాయి కానప్పటికీ ప్రదర్శించిన శౌర్య ప్రతాపాలకు మెన్షన్‌ ఇన్‌ డిస్పాచ్‌ అనే గుర్తింపును ఇస్తారు. కాగా, శౌర్య పురస్కారాల్లో ఎక్కువగా సీఆర్పీఎఫ్‌ సిబ్బందికే దక్కాయి. సీఆర్పీఎఫ్‌కు సేవలందించిన 52 మంది శౌర్య పురస్కారాలకు ఎంపికయ్యారు.

శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రకు ఆర్మీకి సేవలు అందించిన నలుగురు ఎంపికయ్యారు. రాష్ట్రీయ రైఫిల్స్‌ 19వ బెటాలియన్‌కు చెందిన కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌(మరణానంతరం), 56వ బెటాలియన్‌కు చెందిన మేజర్‌ మల్ల రామగోపాల్‌ నాయుడు, 63వ బెటాలియన్‌కు చెందిన రైఫిల్‌మ్యాన్‌ రవికుమార్‌(మరణానంతరం), జమ్ము కశ్మీర్‌ పోలీసు శాఖలో డీసీపీగా పని చేసిన హుమయున్‌ ముజమ్మిల్‌ భట్‌(మరణానంతరం)కు కీర్తి చక్ర పురస్కారాలు దక్కాయి.

శాంతికాలంలో ఇచ్చే మూడో అత్యున్నత శౌర్య పురస్కారమైన శౌర్య చక్ర పురస్కారం ఆర్మీకి సేవలు అందించిన కర్నల్‌ పవన్‌ సింగ్‌, మేజర్‌ సీవీఎస్‌ నిఖిల్‌, మేజర్‌ ఆశిష్‌ ధోన్‌ఛక్‌(మరణానంతరం), మేజర్‌ త్రిపాత్‌ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ సాహిల్‌ రంధవా, సుబేదార్‌ సంజీవ్‌ సింగ్‌ జస్రోతియా, నాయబ్‌ సుబేదార్‌ పీ పబిన్‌ సింఘా, సిపాయి ప్రదీప్‌ సింగ్‌(మరణానంతరం), అబ్దుల్‌ లతీఫ్‌, నేవీకి చెందిన కెప్టెన్‌ శరద్‌ సిన్సువాల్‌, లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ కపిల్‌ యాదవ్‌, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ వెర్నాన్‌ దెస్మాండ్‌ కేన్‌, స్కాడ్రన్‌ లీడర్‌ దీపక్‌ కుమార్‌, సీఆర్పీఎఫ్‌కు చెందిన పవన్‌ కుమార్‌(మరణానంతరం), సీ దేవన్‌(మరణాంతరం), లఖ్‌వీర్‌, రాజేశ్‌ పంచల్‌, మల్కిత్‌ సింగ్‌కు దక్కాయి.

పంజాబ్‌కుచెందిన మన్‌ప్రీత్‌ సింగ్‌ 17 ఏండ్ల పాటు ఆర్మీలో సేవలందించారు. ఆయన తండ్రి కూడా ఆర్మీలో పని చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ 12న జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఆయన వీరోచితంగా పోరాడి మరణించారు. ఇదే ఘటనలో మరణించిన హుమయున్‌ ముజమ్మిల్‌ భట్‌కు కూడా మరణాంతరం కీర్తి చక్ర దక్కింది.

1,037 మందికి పోలీస్‌ మెడల్స్‌

కాగా, కేంద్ర, రాష్ట్ర బలగాల్లో విశిష్ట సేవలందించిన 1,037 మంది పోలీసులకు ప్రభుత్వం బుధవారం సేవా పతకాలను ప్రకటించింది. అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం (పీఎంజీ) ఈసారి తెలంగాణకు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ యాదయ్య దక్కించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరికి ఈ పతకాలను అందజేస్తామని కేంద్ర హోం శాఖ తెలిపింది. 

రాష్ట్రపతి శౌర్య పతకం సహా 214 మందికి శౌర్య పతకాలు, 231 మందికి పరాక్రమ పతాకాలు ప్రదానం చేస్తారు. మొత్తం పతాకాల్లో 52 శౌర్య పతాకాలు సీఆర్‌పీఎఫ్‌, 31 జమ్ము-కశ్మీర్‌ పోలీసు, యూపీ, మహారాష్ట్ర పోలీసులకు 17 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌కు 15, మధ్యప్రదేశ్‌కు 12 పతకాలు లభించాయి. ఇక ఇతర వాటిల్లో 94 ప్రెసిడెంట్‌ పోలీస్‌ పతాకాలు విశిష్ట సేవలకు, 729 పతకాలు ప్రశంసాపూర్వక సేవలు అందించిన వారికి లభించాయి.