ఎస్ బిఐ, పిఎన్‌బి బ్యాంకుల్లో కర్ణాటక లావాదేవీలు బంద్

ఎస్ బిఐ,  పిఎన్‌బి బ్యాంకుల్లో కర్ణాటక లావాదేవీలు బంద్
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు సిద్దరామయ్య సర్కార్‌ షాకిచ్చింది. ఆ రెండు బ్యాంకులతో తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ బిఐ,  పిఎన్‌బి   బ్యాంకుల్లోని ఖాతాలను మూసివేయాలని, డిపాజిట్లను వెంటనే రికవరీ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో నిర్వహించే ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ సంస్థలు రద్దు చేయాలని ఆ ఆర్డర్‌లో పేర్కొన్నారు. అలాగే ఇకపై ఈ బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాల్లో డిపాజిట్లు చేయవద్దని స్పష్టం చేశారు. 

సీఎం సిద్ధరామయ్య ఆమోదించిన ఈ ఉత్తర్వును ఆర్థిక కార్యదర్శి జారీ చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. నిధుల దుర్వినియోగంపై ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ తీరుమారలేదని తెలిపింది. రెండు బ్యాంకుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, సమస్య అపరిష్కృతంగా ఉండడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది.

వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న రూ.187 కోట్ల అక్రమ లావాదేవీల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై రెండు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. మహర్షి వాల్మీకి కార్పొరేషన్‌ నిధుల గోల్‌మాల్‌లో బ్యాంకు అధికారుల హస్తముందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది.

కర్నాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కెఐఎడిబి) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) నుండి డిపాజిట్‌ను తిరిగి పొందలేకపోయిందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్  స్టేట్ బ్యాంక్ ఆఫ్‌తో ఇదే సమస్యను ఎదుర్కొందని ఆర్థిక శాఖ అన్ని డిపార్ట్‌మెంట్ హెడ్‌లకు సర్క్యులర్ జారీ చేసింది.