
* శక్తివంతమైన మహిళగా కంగనా రనౌత్!
బాలీవుడ్ క్వీన్, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో నటి కంగన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాకు కంగనయే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో స్టార్ నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
కాగా, ఈ సినిమా వరల్డ్వైడ్గా సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది. చాలా రోజుల కిందటే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. పలు కారణాల వల్ల అనేక సార్లు చిత్రీకరణ వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు సెప్టెంబర్లో థియేటర్లలోకి రానుంది.
ఇక గతంలో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవీ’ అనే సినిమాను తెరకెక్కించగా, అందులో కంగనా జయలలిత పాత్రలో కనిపించి మంచి గుర్తింపు పొందారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
కంగనా రనౌత్ ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక క్యారెక్టర్లలో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ ఆమె నటించి మెప్పించారు. ఇటీవలే ఆమె లీడ్ రోల్లో ‘తేజస్’ అనే సినిమా థియేటర్లలోకి వచ్చారు. ఇందులో ఆమె యుద్ధ విమానాన్ని నడిపే ఓ ఫైటర్గా కనిపించారు.
భారీ బడ్జెట్తో విడుదలైన ఆ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ టాక్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతకుముందు వచ్చిన ‘చంద్రముఖి-2’ కూడా కంగనాకు మంచి హిట్ను ఇవ్వలేకపోయింది. దీంతో ఎమెర్జెన్సీపైనే కంగనా ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ సక్సెస్ సాధించి కంగనాకు బ్రేక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!