
ఏపీ సీఐడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి కబ్జా చేసిన వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అతనితో పాటు అందుకు సహకరించిన సర్వేయర్ రమేష్ ను కూడా అరెస్ట్ చేశారు.
ఈ కేసులో జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున ఎసిబి సోదాలు ప్రారంభించినప్పటి నుండి పలు మలుపులు తిరుగుతూ వస్తున్నది. మొత్తం వ్యవహారంపై ఏసీబీ అడిషినల్ ఎస్పీ సౌమ్యలత మీడియాతో ‘అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయి. ఇద్దరిని ఈరోజు అరెస్టు చేశాం. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్‌ను కూడా మార్చారు. ఏసీబీ అధికారుల విచారణలో అవకతవకలు నిజమని తేలాయి’ అని తెలిపారు.
“సిఐడి అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నాం. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. మా విచారణ లో పిసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. అందుకే మా విచారణ వేరుగా సాగిస్తున్నాం. సీఐడీ, ఏసీబీ అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులకు వివరిస్తాం. మా దర్యాప్తులో ఐదుగురి పేర్లు ఉన్నాయి. విచారణలో మరికొన్ని పేర్లు ఉండొచ్చు” అని ఆమె చెప్పారు. ఈ కేసులో జోగి రమేష్ పాత్రపై కూడా విచారణ జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
అగ్రిగోల్డ్ భూమి వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తన కుమారుడు డెలాయిట్‌లో పనిచేస్తున్నాడని, ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని ఈ కేసులో ఇరికించారన్నారని ఆరోపించారు.
‘ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంపై బహిరంగ చర్చకు సిద్దం. మా కుటుంబం ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలకు అయినా సిద్దం. సీఎం చంద్రబాబు రాజకీయాలకు మా వాడిని బలి చేస్తున్నారు. మీకు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనేది గుర్తు ఉంచుకోండి. ఇక్కడితో అయిపోదు.. మాకు కూడా సమయం వస్తుంది’ అని హెచ్చరించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు