
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 (పై అధ్యయనానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. తాజాగా ఈ కమిటీకి చైర్మన్‌గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు
వక్ఫ్స్ (సవరణ) బిల్లు 2024ను కేంద్రం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వక్ఫ్ ఆస్తులను నియంత్రించే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకు దఖలు పరిచే విధంగా సవరణలు ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా మహిళలతోపాటు, ముస్లిమేతరులకు వక్ఫ్‌బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పించే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ బిల్లును విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే జేపీసీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులకు అవకాశం కల్పించారు.
జగదాంబికా పాల్ (కమిటీ చైర్మన్), నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిజిత్ గంగోపాధ్యాయ, డీకే అరుణ, గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొహమ్మద్ జావేద్, మౌలానా మొహిబుల్లా నాద్వి, కళ్యాణ్ బెనర్జీ, ఎ రాజా, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, దిలేశ్వర్ కమైత్, అరవింద్ సావంత్, సురేష్ గోపీనాథ్, నరేష్ గణపత్, అరుణ్ భారతి, అసదుద్దీన్ ఒవైసీ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
ఇక రాజ్యసభ నుంచి బ్రిజ్ లాల్, మేథా విక్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, మొహమ్మద్ నదీముల్ హఖ్, విజయసాయి రెడ్డి, మొహమ్మద్ అబ్దుల్లా, సంజయ్ సింగ్ , ధర్మశాల వీరేంద్ర హెగ్డే ఈ కమిటీకి సభ్యులుగా వ్యవహరించనున్నారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం