అమరావతికి సాయంపై ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన

అమరావతికి సాయంపై ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
అమరావతికి ప్రపంచ ఆర్ధిక సంస్థల ద్వారా రూ 15,000 కోట్ల సాయం గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన కొద్దీ రోజులకే ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం శనివారం అమరావతిలో పర్యటించింది. తొలుత సిఆర్‌డిఎ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం రాజధాని పరిధిలో కట్టడాలు, ఇతర నిర్మాణాలు, ప్రస్తుత స్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 
 
నలుగురు ఉన్నతాధికారులు, ఎనిమిది మంది సహాయకులు ఈ బృందంలో ఉన్నారు. ఉదయం సిఆర్‌డిఎ కార్యాలయానికి చేరుకున్న బ్యాంకు బృందం రాజధాని నిర్మాణ రుణ ప్రతిపాదనల గురించి చర్చించినట్లు సమాచారం. రాజధాని అమరావతికి ఎటువంటి సహాయం కావాలి? ఏ పద్ధతుల్లో తీరుస్తారు? అనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కనీసం రు.15 వేల కోట్లు రుణంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై నేడు మళ్లీ ప్రపంచబ్యాంకు బృంద సభ్యులు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అమరావతి సస్టయినబల్‌ క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎఎస్‌సిసిడిపి)కు సంబంధించిన అంశాలను అధికారులు ప్రపంచబ్యాంకు ప్రతినిధుల ముందుంచినట్లు తెలిసింది. 

దీనిపై 2016లో ప్రపంచ బ్యాంకుకు రూపొందించిన ప్రాజెక్టు నివేదిక(పి159808)కు సంబంధించిన అంశమూ చర్చకు వచ్చింది. అప్పట్లో ప్రతిపాదించిన లెక్కలను కొంత సవరించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2050 నాటికి అమరావతి నగరంలో 3.5 మిలియన్‌ ప్రజలు ఉంటారని, వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

20 శాతం ఏరియాను గ్రీన్‌, బ్లూ ఏరియాగా మారుస్తామని, నగరంలో ఉండే ప్రతిపౌరుడూ నేరుగా కాలినడక దూరంలో పార్కును చేరుకునేలా ప్లాన్‌ చేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా రోడ్లు, యుటిలిటీ కారిడార్లు, గ్రామీణ సదుపాయాల మెరుగుదల (మంచినీరు, సీవరేజీ, విలేజ్‌రోడ్లు, కనెక్టివిటీ, ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) వరద ముంపు నివారణ కాలువల మెరుగుదల చేసేందుకు అవసరమైన నిధులు రుణంగా ఇవ్వాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులను కోరారు. 

దీనికోసం కనీసం రూ.40 వేల కోట్ల అవసరం ఉందని, తాత్కాలికంగా రూ.15 వేల కోట్లు ఏర్పాటు చేస్తే వెసలుబాటుగా ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. సుదీర్ఘ చర్చ అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు క్యాపిటల్‌ సిటీ ఏరియాను పరిశీలించాలని కోరగా సిఆర్‌డిఎ అధికారులు తీసుకెళ్లారు.

రాయపూడిలో భవనాలు, హైకోర్టు పరిసరాలు, నిలిచిపోయిన నిర్మాణాలను ప్రతినిధి బృందానికి చూపించారు. గతంలో పర్యావరణ ప్రభావం (ఇఐఎ), పర్యావరణ సామాజిక నిర్వహణ ఫ్రేమ్‌వర్కు (ఇఎస్‌ఎంఎఫ్‌) కూడా పూర్తి చేసినందున ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని అధికారులు చెప్పినట్లు తెలిసింది.