విశాఖ రైల్వే జోన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. గత ప్రభుత్వం కేటాయించిన స్థలం నీరు నిలిచే ప్రాంతమని, అందుచేతమరో స్థలం కేటాయించేలా చర్చిస్తున్నామని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తరచూ తమతో మాట్లాడుతున్నారని తెలిపారు.
కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలుగు రాష్ర్టాలకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. శనివారం ఢిల్లీలోని రైల్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రాజెక్టుతో ఏపీలో 85.5 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. హౌరా- చెన్నై రైల్వే కారిడార్ అనేక రాష్ర్టాలను కలుపుతుందని, ఈ కారిడార్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించామని తెలిపారు.
విజయనగరం వరకు 3వ లైన్ నిర్మాణం ఆమోదం పొందిందని చెప్పారు. మొత్తంగా 4 లైన్ల కారిడార్ నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. అసన్‌సోల్ (బెంగాల్)- వరంగల్ వరకు కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జునాగఢ్- నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి- పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారిడార్లో భాగంగా ఉంటాయని కేంద్ర మంత్రి వివరించారు. రూ.7,383 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.’
ఈ ప్రాజెక్టు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని, ఉత్తర- తూర్పు భారతదేశానికి అదనపు రైలు కారిడార్ అవుతుందని, దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును వేగంగా చేరవేయడానికి , అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడం లో ప్రయోజనకారిగా సహాయపడుతుందని అశ్వని వైష్ణవ వివరించారు.
ఈ కొత్త లైన్ ఆంధ్ర, తెలంగాణలలో వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కూడా అందిస్తుందని, ఇది ఇప్పటికే ఉన్న విజయవాడ- విశాఖపట్నం-భువనేశ్వర్- కోల్‌కతా కోస్తాతీరప్రాంతానికి నూతనంగా నిర్మిస్తున్న వరంగల్-భద్రాచలం- మల్కన్గిరి- జయ్‌పూర్ – టిట్లాగఢ్‌కు అదనపు రైలు మార్గాన్ని అందిస్తుందని తెలిపారు.
సింగరేణి బొగ్గు ఎగుమతికి ఇదెంతో దోహదపడుతుందని అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్ ద్వారా 500 నుంచి 700 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులోనే భద్రాచలం వద్ద గోదావరిపై రైల్వే బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. తుఫాన్లు ఏర్పడినప్పుడు కోస్తా ఏరియాలో సరకు రవాణాకు ఈ కారిడార్ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
గతంలో వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రభావితమైన కలహండి , నబరంగ్పూర్ , కోరాపుట్ , రాయగడ , మల్కన్గిరి గిరిజన జిల్లాలకు ఈ లైన్ అనుసంధానాన్నిఅందిస్తుంది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. శాంతి పునరుద్ధరణ జరుగుతోంది. ఈ కొత్త లైన్ కారిడార్ ఒడిశా, తూర్పు గోదావరి (ఆంధ్రప్రదేశ్), భదాద్రి కొత్తగూడెం (తెలంగాణ) జిల్లాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తూంది. ఈ కారిడార్ మహానది బొగ్గు క్షేత్ర ప్రాంతాల నుండి మధ్య-దక్షిణ భారతదేశంలో ఉన్న పవర్ ప్లాంట్లకు త్వరిత అనుసంధానాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు.
కొత్త రైల్వే లైన్ విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. తుఫానుల సమయంలో హౌరా-విజయవాడ తీర మార్గంలో ప్రస్తుతం ఉన్న మార్గాల అనుసంధానం దెబ్బతింటే ఈ ప్రత్యామ్నాయ కొత్త రైల్వే లైన్ ఒడిశాలోని వివిధ జిల్లాలకు అనుసంధానాన్ని అందిస్తుంది. ఇది ఈ ప్రాంతానికి ఆహార ధాన్యాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటును సులభంగా అందించేందుకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కొత్త రైల్వే లైన్ ద్వారా బస్తర్ ప్రాంతం నుండి దక్షిణ భారతదేశానికి 124 కి.మీ దూరం తగ్గుతుంది. రాజమండ్రి, విశాఖపట్నం వంటి రద్దీ కారిడార్‌లను దాటవేస్తూ ప్రత్యామ్నాయ మార్గంగా కూడా పని చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ 1 కోటి పనిదినాల ఉపాధిని సృష్టిస్తుంది. 3 కోట్ల 80 లక్షల చెట్ల పెంపకానికి సమానమైన 267 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.
More Stories
నాలుగు లేబర్ కోడ్ ల అమలు స్వాగతించిన బిఎంఎస్
శాంతి, సామరస్యం, పురోగతి కోసం ఐక్యత, వ్యక్తిత్వ నిర్మాణం
కశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధ డంప్‌కు కుట్రలు