బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులు `హీనమైనవి’

బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులు `హీనమైనవి’
బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై జరుగుతు  న్న దాడులను ‘హీనమైనవి’ అని పేర్కొంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత  ముహమ్మద్ యూనస్ వాటిని తీవ్రంగా ఖండించారు.  హిందూ, క్రైస్తవ, బౌద్ధ కుటుంబాలను హాని నుండి రక్షించాలని నిరసనకారులను కోరారు. ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడటం ద్వారా తమ పురోగతిని అణగదొక్కాలని కోరుకునే వారి ప్రయత్నాలను విధ్వంసం చేయవద్దని ఆయన వారిని హెచ్చరించారు. 
 
రంగ్‌పూర్ నగరంలోని బేగం రోకేయా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీ ప్రయత్నాలను ఫలించకుండా ఉండటానికి చాలా మంది నిలబడి ఉన్నారు. ఈసారి విఫలం కావద్దు” అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను ఆయన నిర్ద్వంద్వంగా ఖండించారు.  “వారు ఈ దేశ ప్రజలు కాదా? మీరు దేశాన్ని రక్షించగలిగారు. మీరు కొన్ని కుటుంబాలను రక్షించలేరా?” అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
 “ఎవరూ వారికి హాని చేయలేరు. వారు మా సోదరులు. మేము కలిసి పోరాడాము. మేము కలిసి ఉంటాము” అంటూ మీరు తప్పక చెప్పడం ద్వారా  జాతీయ ఐక్యత నిలబెట్టుకోవాలని యూనుస్ పిలుపిచ్చారు. యువ నాయకత్వం  ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ “ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది.  మీకు కావలసిన చోటికి తీసుకెళ్లగల శక్తి మీకు ఉంది. ఇది పరిశోధనకు సంబంధించిన విషయం కాదు – ఇది మీలో ఉన్న శక్తి”  అని తెలిపారు. 
 
షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సమయంలో విద్యార్థి కార్యకర్త అబూ సయ్యద్ ధైర్యంగా నిలబడిన విధానాన్ని అనుసరించాలని యూనస్ బంగ్లాదేశ్ ప్రజలను కోరారు. కాగా, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని శనివారం అధికారులను ఆయన ఆదేశించారు.
 
కాగా, బంగ్లాదేశ్‌లోని మైనారిటీ కమ్యూనిటీల సభ్యులు ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి 52 జిల్లాల్లో కనీసం 205 దాడులను ఎదుర్కొవలసి రావడంతో యూనస్ ఈ పిలుపు ఇవ్వాల్సి వచ్చింది.  రెండు హిందూ సంస్థలు — బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవులు యూనిటీ కౌన్సిల్, బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ — దేశంలో. ఈ పరిణామాల నేపథ్యంలో వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులను హింస నుండి తప్పించుకోవడానికి పొరుగున ఉన్న భారతదేశానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
 
తమపై జరుగుతున్న దాడుల గురించి ఈ రెండు సంస్థలు యూనస్ కు ఓ లేఖ వ్రాస్తూ  ‘బంగ్లాదేశ్ లో మేము రక్షణ కోరుతున్నాం. మా జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాత్రంతా నిద్ర పోకుండా ఇళ్లకు, ఆలయాలకు కాపలాగా ఉంటున్నాం. ప్రభుత్వం వెంటనే మతపరమైన ప్రశాంతతను నెలకొల్పాలి’ అని కోరాయి.
మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు, అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు  థనేదార్, రాజా కృష్ణమూర్తి వేర్వేరుగా లేఖలు రాశారు.