టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్రొత్త ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి క్రొత్త ఇంటి తలుపులు భార్యవాణి , కూతురు హైందవి, బంధువులు పగలగొట్టారు. గత రెండేళ్లుగా దువ్వాడ కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వేరు వేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య జేడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటున్నారు.
ఈ క్రమంలో రెండు రోజులుగా దువ్వాడ భార్య , కూతుర్లు ఆందోళన మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్క సారిగా భార్యాకూతురిని చూసి చిందులు తొక్కారు.
భార్యా కూతురిని చంపేస్తాను అంటూ గ్రానైట్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు. పోలీసులు ఆయనను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్యాకూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి, హైందవిలు బైఠాయించారు.
హైందవి మాట్లాడుతూ.. తన తండ్రిని కలిసేందుకు గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ స్పందన లేదన్నారు. ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వెల్లడించారు. వైసీపీ లో ఇటువంటి నాయకులను జగన్ పెంచి పోషిస్తున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామంలో జాతీయ రహదారిపై దువ్వాడ ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. దువ్వాడ ఆ ఇంట్లోనే ఉంటున్నారు.
ఈ క్రమంలో కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు ఆయన కుమార్తెలు ప్రయత్నించారు. గురువారం సాయంత్రం 3.30 గంటలకు దువ్వాడ కుమార్తెలు అక్కడకు చేరుకున్నా వారిని లోనికి రానివ్వలేదు. దీంతో వారు ఇంటి బయటే నిరీక్షించారు. దువ్వాడతో కొంత కాలంగా ఆయన సతీమణికి విభేదాలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా దువ్వాడ సతీమణి చివరి నిమిషం వరకు పోటీలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధం కావడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.

More Stories
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్