
ఈ నెల 11న జరుగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్ష (నీట్ పిజి 2024) వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. పరీక్షకు రెండు రోజుల ముందు పరీక్షను వాయిదా వేయాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
‘ఇప్పుడు నీట్ పీజీని వాయిదా వేయిస్తున్నారా..? ఆ పరీక్షను ఎలా వాయిదా వేయగలం ? ఈ రోజుల్లో పరీక్షను వాయిదా వేయమని అడుగుతూ వస్తున్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరో పరీక్ష ఉన్నందున పరీక్షను రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉందని, 50 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ మేరకు పరీక్షను వాయిదా వేయాలని ఆదేశించలేమని చెప్పింది.
కొందరు పిటిషన్లతో చాలామంది అభ్యర్థుల కెరీర్‌ను ప్రమాదంలో పడవేయలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అసౌకర్యంగా ఉన్న నగరాల్లో ఎగ్జామ్ సెంటర్‌ను కేటాయించడం వల్ల చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విశాల్ సోరెన్ అనే పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా జూన్ 23న పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. ఏ నగరంలో పరీక్ష కేంద్రం ఉంటుందనేది జులై 31న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) అధికారులు తెలిపారని పేర్కొన్నారు.
ఇక ఆదివారం నిర్వహించాల్సిన పరీక్షా కేంద్రం సమాచారాన్ని గురువారం వెల్లడించారని విద్యార్థుల తరపు న్యాయవాది వాదించారు. రెండు సెషన్‌లలో పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారని, అయితే ‘స్కోర్స్ నార్మలైజేషన్ ఫార్ములా’ను ఇంకా వెల్లడించలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్ట్ పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్