అమెరికాలో రేవంత్ రెడ్డి తమ్ముడు కంపెనీతో ఒప్పందమా!

అమెరికాలో రేవంత్ రెడ్డి తమ్ముడు కంపెనీతో ఒప్పందమా!
తెలంగాణాలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అంటూ అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు చేసుకుంటున్న కంపెనీలు ప్రకటిస్తున్న  పెట్టుబడులు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు పేరున్న కంపెనీలను మాత్రమే ఆహ్వానిస్తాయి.
 
అందుకు భిన్నంగా నిన్న మొన్న ఏర్పడ్డ బినామీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడంతో దుమారం చెలరేగుతోంది. షేర్‌ క్యాపిటల్‌ లక్షల్లో కూడా లేని కంపెనీలు రూ. వేల కోట్లు పెట్టుబడులను పెట్టబోతున్నట్లు ప్రచారం చేసుకోవడం ప్రజల్లో సందేహాలు పెరుగడానికి కారణమవుతుంది. 
 
ముఖ్యంగా ముఖ్యమంత్రి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ బయోగ్రీన్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం, ఈ విషయమై వివాదం చెలరేగడంతో వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆ కంపెనీ వివరాలను స్వల్పంగా మార్చుతూ మరేదో చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో ప్రకటించిన పెట్టుబడి ప్రణాళిక వివాదంకు దారితీసింది. 
 
“ఉత్తేజకరమైన వార్తలు! ముఖ్యమంత్రి @revanth_anumula, పరిశ్రమలు ఐటి మంత్రి @OffDSB తో ఉత్పాదక సమావేశం తరువాత, స్వచ్ఛ్ బయో, లిగ్నోసెల్యులోసిక్ బయోఫ్యూయల్స్ తయారీ కంపెనీ, తెలంగాణలో 250 కేఎల్ పిడి  (రోజుకు కిలో లీటర్లు) బయోఫ్యూయల్ ప్లాంట్‌కు ప్రణాళికలను ప్రకటించింది”అని సిఎంఓ హర్షం వ్యక్తం చేసింది.
 
తెలంగాణలో సుస్థిర వృద్ధిని పెంపొందించడంతోపాటు పెట్టుబడులు 500 ఉద్యోగాలను సృష్టిస్తాయని సీఎంఓ పేర్కొంది. సీఎంఓ  ట్వీట్‌లో పేర్కొన్న స్వచ్ఛ్ బయో అనే సంస్థకు డిజిటల్ ఉనికి లేదు. ఇది అమెరికాలో ఉన్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు ముఖ్యమంత్రి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల పేరుతో స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ చేయబడింది.
 
ప్రవీణ్ పరిపాటి అని సీఎంవో ట్వీట్‌లో పేర్కొన్నారు. అతనికి, స్వచ్ఛ్ బయోకి మధ్య ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అతను వర్జీనియా-ఆధారిత సుగానిట్ సిస్టమ్స్ యజమాని. 2006లో స్థాపించిన ఈ సంస్థ ప్రధానంగా జీవ ఇంధనాలతో వ్యవహరిస్తుంది. సీఎంఓ ట్వీట్ తర్వాత, వాస్తవంగా తెలియని కంపెనీ తెలంగాణాలో రూ. 1000 కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందనే దానిపై చాలా మంది అనుమానాలు లేవనెత్తారు.
 
అమెరికాలోని కార్పొరేషన్‌లను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ అయిన నేషనల్ కార్పొరేషన్ డైరెక్టరీలో స్వచ్ఛ్ బయోపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సీఎంఓ ట్వీట్‌లో ప్రస్తావించినట్లు ఆరోపణలు వచ్చాయి.
 
21 జూలై 2024న రిజిస్టర్ అయిన ఈ కంపెనీ రెండు వారాల క్రితమే ఏర్పాటు చేసినది. దాని సారూప్య పేరు కారణంగా, ప్రతిపక్షం ఒప్పందపు చట్టబద్ధతను ప్రశ్నిస్తోంది.  వేదవల్లి శివానంద రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల కలిసి ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. కంపెనీని పానీయాల తయారీదారుగా నమోదు చేశారు.
 
బోగస్‌ కంపెనీలతో సర్కారు ఒప్పందాలు చేసుకున్నటున్నదని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉండడంతో పరువు కాపాడుకోవడానికి ప్రభుత్వం ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ వంటి ఐఏఎస్‌లతో ప్రకటనలను గుప్పిస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో అమెరికా పర్యటన సజావుగా సాగుతున్నదని, ఒప్పందాలు, మీటింగ్‌లపై అపోహలేమీ పెట్టుకోవద్దని జయేశ్‌రంజన్‌ వివరణ ఇవ్వడమే దీనికి రుజువు. మంత్రులెవ్వరూ ఈ ఒప్పందాల గురించి మాట్లాడకపోవడం గమనార్హం. 
 
సీఎం రేవంత్‌ సోదరుడికి చెందిన స్వచ్ఛ్‌ బయోగ్రీన్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వివరాలను దాచిపెట్టిన సీఎంవో  ‘స్వచ్ఛ్‌ బయోగ్రీన్‌’ స్థానంలో ‘స్వచ్ఛ్‌బయో’ అనే అసలు ఉనికిలోనే లేని కంపెనీని తెరమీదకు తీసుకొచ్చి, ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నట్టు వెల్లడించింది. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొన్న కంపెనీల సమాచారాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన సీఎంవో అరకొర వివరాలతో సమాచారాన్ని ఇవ్వడంపై అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. పెట్టుబడుల ప్రక్రియలో తప్పులు జరుగకుంటే సీఎంవో ఎందుకు నిజమైన కంపెనీల పేర్లను వెల్లడించడంలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.