ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ‘క్రీమీలేయర్​’ వర్తింపజేయం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ‘క్రీమీలేయర్​’ వర్తింపజేయం
* ప్రధానికి కృష్ణ మాదిగ ధన్యవాదాలు
 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని (క్రీమీలేయర్‌) వర్తింపజేయకూడదని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. 

‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ నిబంధన లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్‌లో పూర్తిస్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత.. రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది’’ అని  అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.
 
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ నిబంధనలన్నీ రాజ్యాంగం ప్రకారమే ఉంటాయని పునరుద్ఘాటించారు.ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇటీవల సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు తమ పరిధిలో వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో, ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి ఓ విధానాన్ని నిర్దేశించుకోవాలని, రిజర్వేషన్లలో నిజమైన సమానత్వం సాధించడానికి ఇదే మార్గమని కూడా వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో, క్యాబినెట్‌ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించి.. రాజ్యాంగానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. తద్వారా, సుప్రీం కోర్టు సూచించినట్లు ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్‌ను అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు.

ఇలా ఉండగా,  ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ విధానాన్ని అవలంభించాలని సూచిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయా వర్గాలకు చెందిన బీజేపీ 100 మంది ఎంపీలు అభ్యంతరం తెలిపారు. క్యాబినెట్‌ భేటీ కంటే ముందు వారు ప్రధాని మోదీని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఉభ‌య‌స‌భ‌ల‌కు చెందిన ఆ ఎంపీలు రాజ్యసభ సభ్యులు  ప్రొఫెస‌ర్ సికంద‌ర్ కుమార్ నేతృత్వంలో  ప్ర‌ధాని మోదీని క‌లిశారు.

 అంద‌రు ఎంపీల ఫిర్యాదుల‌ను ప్ర‌ధాని మోదీ ఆల‌కించార‌ని, ఎంపీల‌కు అనుకూలంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చార‌ని ఎంపీ సికంద‌ర్ కుమార్ తెలిపారు.  క్రిమీలేయ‌ర్ అంశంపై సుప్రీం కోర్టు చేసిన సూచ‌న‌ల గురించి ద‌ర‌ఖాస్తు ఇచ్చిన‌ట్లు ఎంపీ తెలిపారు. 

క్రిమీలేయ‌ర్ నిర్ణ‌యాలను అమ‌లు చేయ‌రాదు అని వంద మంది ఎంపీలు ప్ర‌ధాని మోదీని కోరినట్లు తెలుస్తోంది. క్రీమీలేయర్‌ విషయంలో ప్రధాని మోదీ తమతో సుదీర్ఘంగా చర్చించారని.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను అమలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ విధానాన్ని తీసుకురావాలనేది ఒక జడ్జి సూచన మాత్రమేనని, అది మెజారిటీ తీర్పులో లేదని కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను మందకృష్ణ మాదిగ శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో కలిశారు. దాదాపు 30 నిమిషాలు ప్రధానితో భేటీ అయిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, మంద కృష్ణను ఆప్యాయంగా పలకరించి హత్తుకున్న ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు. వర్గీకరణ అంశంపై కొందరు సుప్రీం కోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు.