
* యూనస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ప్రధాని పదవితో సమానమని అధికారులు ప్రకటించారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి 16 మంది సభ్యులతో సలహా మండలిని ప్రకటించారు.
గురువారం రాత్రి 9.20 గంటల సమయంలో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్, మహ్మద్ యూనస్‌చేత తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత కేబినెట్ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. విద్యార్ధి నాయకులు నహిద్ ఇస్లామ్, అసిఫ్ మహ్మద్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరారు.
బంగాభవన్ అధ్యక్ష భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిఎన్‌పి, బంగ్లాదేశ్ జమాత్ ఇ ఇస్లామి సహా ఇతర రాజకీయ నేతలు, బ్రిటన్, జపాన్, చైనా, ఫిలిప్పీన్స్, ఇరాన్, తదితర దేశాల నుండి దౌత్యవేత్తలు హాజరయ్యారు. అవామీ లీగ్ నుండి ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు.
బంగ్లాదేశ్‌లో శాంతిని పునరుద్ధరించడం, వారాల తరబడి హింస కొనసాగిన నేపథ్యంలో తాజాగా ఎన్నికలకు సిద్ధమవడం ప్రస్తుతం యూనస్ ముందున్న కీలకమైన సవాళ్లు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై తలెత్తిన ఆందోళనలు, నిరసనలతో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన మూడు రోజుల వ్యవధిలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
రాజ్యాంగాన్ని పరిక్షిస్తానని, నిజాయితీగా తన విధులను నిర్వర్తిస్తానని యూనస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరుల భద్రతకు హామీ కల్పించే ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఒలింపిక్ క్రీడల కోసం ప్రస్తుతం పారిస్‌లో వున్న ఆయన గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకున్నారు.
ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్, సీనియర్ అధికారులు, విద్యార్ధి నేతలు, ప్రముఖులు ఆయనకు హజరత్ షాజ్‌లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. యూనస్‌కు అవసరమైన సాయం, తోడ్పాటును సాయుధ బలగాలు అందిస్తాయని జనరల్ జమాన్ ప్రకటించారు. భవిష్యత్ నిర్మాణంలో మహిళల పాత్ర ఎనలేనిదని యూనస్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారధిగా బాధ్యతలు స్వీకరించిన ముహమ్మద్ యూనస్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని భారత్ కోరుకుంటోందని మోదీ తెలిపారు. సాధారణ పరిస్థితి నెలకొంటే హిందువులతో పాటు ఇతర మైనారిటీలు భద్రతంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు.
‘‘ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ కొత్త బాధ్యతలు స్వీకరించిన వేళ ఆయనకు నా శుభాకాంక్షలు. హిందువులు, ఇతర అన్ని మైనారిటీ వర్గాల భద్రత, రక్షణకు భరోసానిస్తూ వీలైనంత త్వరగా సాధారణ స్థితికి దేశం చేరుకోవాలని భారత్ ఆశిస్తోంది. ఇరుదేశ ప్రజల శాంతి, భద్రత, పురోగతి సాకారం చేసేందుకుగానూ బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
More Stories
ముస్లింలు, ఆర్ఎస్ఎస్ : వ్యక్తిగత స్మృతులు
చిన్న పార్టీలే బీహార్ విజేత నిర్ణేతలు
భారత్ తో సంబంధం ఎంతో విలువైనదిగా భావిస్తున్న అమెరికా