హసీనా గద్దె దిగాక కూడా బాంగ్లాదేశ్ లో 3 రోజుల్లో 232 మంది మృతి

హసీనా గద్దె దిగాక కూడా బాంగ్లాదేశ్ లో 3 రోజుల్లో 232 మంది మృతి

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా సారథ్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత జరిగిన అల్లర్లలో 232 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. వీరిలో అత్యధికులు ఒక్క మంగళవారం రోజే ప్రాణాలు వదలడం గమనార్హం. తీవ్ర గాయాలతో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

అంతకుముందు బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణల్లోనూ దాదాపు 328 మంది ప్రాణాలు వదిలారు. జులై 16 నుంచి ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో చనిపోయివారి మొత్తం సంఖ్య 560కి చేరింది. 

ఇక గాజీపూర్‌లోని కాశీంపూర్ హైసెక్యూరిటీ జైలు నుంచి మంగళవారం రోజు 209 మంది ఖైదీలు పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా జైలు గార్డులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన తర్వాత అవామీలీగ్ పార్టీ శ్రేణులు లక్ష్యంగా పెద్దఎత్తున దాడులు జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ ఘర్షణల వల్లే షేక్ హసీనా పార్టీ నాయకులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవామీ లీగ్‌కు చెందిన ఇద్దరు నాయకులు దేశం విడిచి పారిపోతుండగా చుడంగాలోని బంగ్లాదేశ్ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

బంగ్లాదేశ్‌‌ను  అలాగే వదిలేస్తే అది రెండో ఆఫ్ఘనిస్తాన్‌గా మారిపోతుందని, అక్కడ అరాచక పరిస్థితులు ఏర్పడతాయని  షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. `బంగ్లాదేశ్‌లో అశాంతికి ఆజ్యం పోసింది పాకిస్థానే. ఇందులో పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితమైన ప్రణాళికతో ప్రభుత్వాన్ని కూల్చారు. ఉగ్రవాద సంస్థలు, విదేశీ శక్తులు అందించిన తుపాకులతో అల్లరిమూకలు పోలీసులపై దాడి చేశారు.’ అని సజీబ్ ఆరోపించారు.

బంగ్లాదేశ్‌‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత అక్కడికి షేక్ హసీనా కచ్చితంగా తిరిగి వెళ్తారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ గురువారం ప్రకటించారు. ‘షేక్ ముజిబుర్ రెహమాన్ (హసీనా తండ్రి) కుటుంబ సభ్యులు తమ ప్రజలను విడిచిపెట్టరు. ఇబ్బందుల్లో ఉన్న అవామీ లీగ్‌ను కూడా వదిలిపెట్టరు’ అని స్పష్టం చేశారు.