బంగ్లాలో భారత వీసా సెంటర్లు మూసివేత

బంగ్లాలో భారత వీసా సెంటర్లు మూసివేత
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడి, ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రాకపోవడంతో  బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.  బంగ్లా వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. 
 
తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో సందేశం పెట్టారు.
 
సోమవారం షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం ఢాకాలోని భారత రాయబారి కార్యాలయంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 190 మంది అవసరం లేని సిబ్బంది.. తమ కుటుంబాలతో భారత్‌కు వెళ్లారని తెలిపారు. దేశంలో వివిధ దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాలు మాత్రం విధులు నిర్వహిస్తున్నాయని అధికార వర్గాలు ఈ సందర్భంగా వెల్లడించాయి.

ఇలాఉండగా, బంగ్లాదేశ్‌ కొనసాగుతున్న హింసాకాండను ప్రస్తావిస్తూ . భారత్‌కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్‌ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఆశిస్తున్నామని పేర్కొంది. 

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ  బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిపై సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు.  బంగ్లాలోని కొన్ని సంఘాలు మైనారిటీలకు సహాయం చేస్తున్నాయని తమకు సమాచారం అందిందని, ఆయా చర్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు.  అయితే, బంగ్లాదేశ్‌లో పౌరులందరికీ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేయాలనుకుంటున్నామని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులపై రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ మళ్లీ బంగ్లాదేశ్‌లో పరిస్థితి దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరఫున తమ రాయబారి సైతం పాల్గొంటారని చెప్పారు. బంగ్లాదేశ్ పౌరుల భద్రత భారత ప్రభుత్వానికి, ప్రజలకు అత్యంత ప్రాధాన్యత అని చెబుతున్నామని పేర్కొన్నారు. 

బంగ్లాదేశ్‌లో పరిస్థితికి సంబంధించి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. బంగ్లాదేశ్, పశ్చిమాసియాలో పరిస్థితి పురోగతిపై ఇరువురు నేతలు చర్చించారని తెలిపారు.