ఐఐటీ మద్రాసుకు బాపట్ల ప్రవాసాంధ్రుడు రూ.228 కోట్ల విరాళం 

ఐఐటీ మద్రాసుకు బాపట్ల ప్రవాసాంధ్రుడు రూ.228 కోట్ల విరాళం 
మద్రాస్ ఐఐటీకి అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త, బాపట్లకు చెందిన ప్రవాసాంధ్రుడు డాక్టర్ చివుకుల కృష్ణ రూ.228 కోట్ల నిధుల్ని విరాళంగా అందించారు. ఈ మేరకు ఐఐటి మద్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐఐటీ మద్రాస్ కు వచ్చిన అతిపెద్ద విరాళాల్లో ఇదొకటిగా భావిస్తున్నామని, ఈ నిధులను వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు వినియోగిస్తామని సంస్థ డైరెక్టర్ వి.కామకోటి తెలిపారు.

దాదాపు 53 ఏళ్ల తర్వాత మద్రాస్ ఐఐటీకి రూ.228 కోట్లను విరాళంగా ఇచ్చేందుకు పూర్వ విద్యార్థి డాక్టర్ కృష్ణ చివుకుల ముందుకు వచ్చారు. 1970వ దశకంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ చదివిన ఆయన విమానాల విడిభాగాల తయారీలో నిమగ్నమైన కంపెనీలను స్థాపించారు.  2023-24లో ఐఐటీ మద్రాస్‌లో రూ.513 కోట్ల నిధులను సమీకరించామని, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 135 శాతం అధికమని ఐఐటీ మద్రాస్ అధికారులు ప్రకటించారు.

2023-24లో కేవలం పూర్వ విద్యార్థుల ద్వారానే సేకరించిన మొత్తం రూ.367 కోట్లు కాగా, గత ఏడాదితో పోలిస్తే ఇది 282 శాతం అధికం. ఏపీలోని బాపట్లకు చెందిన కృష్ణ చివుకుల కృషిని గుర్తించడంలో భాగంగా ఐఐటీ మద్రాస్ అడయార్ లోని తన విశాలమైన ప్రాంగణంలో కృష్ణా చివుకుల బ్లాక్ ను ఐఐటీ మద్రాస్‌ ఏర్పాటు చేసింది.

2015 లో ఐఐటి మద్రాస్ చివుకులకృష్ణ సాధించిన వృత్తిపరమైన నైపుణ్యం, కృషిని గుర్తించి “విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డు” ప్రదానం చేసింది. బాల్యంలో 8వ తరగతి వరకు తెలుగు మీడియం స్కూల్లో చదివిన చివుకుల మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ఎంటెక్, ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు.

రూ.1,000 కోట్లకు పైగా ఆదాయంతో చివుకుల అమెరికాలో ఇండో-యూఎస్ ఎంఐఎం (మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్) అనే సంస్థను స్థాపించారు. చివుకుల స్థాపించిన మరో సంస్థ అడ్వాన్స్డ్ మాస్ స్పెక్ట్రోస్కోపీలో స్పెషలైజేషన్ చేస్తున్న శివ టెక్నాలజీస్ ఇన్‌ కార్పొరేషన్‌ అని వివరించారు. చివుకుల నుంచి వచ్చిన నిధులను అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా సార్క్ దేశాలకు చెందిన విద్యార్థులు ఐఐటీ మద్రాస్లో స్కాలర్‌షిప్‌ల ద్వారా చదువు కోవడానికి తోడ్పడటం పాటు బహుళ ప్రయోజనాలకు ఉపయోగించనున్నట్లు ఐఐటీ మద్రాస్ అధికారులు తెలిపారు.

డాక్టర్ చివుకుల కృష్ణ కళాశాల రోజుల్లో బస చేసిన క్యాంపస్ లోని కావేరీ హాస్టల్ ను ఇటీవల పునరుద్ధరించారని, ఐఐటీ మద్రాస్ లో డిగ్రీ చేసినప్పుడు అదే హాస్టల్ లో ఉండేవారని కామకోటి గుర్తు చేశారు.