బంగ్లాదేశ్ నుండి అత్యవసరం కానీ దౌత్య సిబ్బంది వెనక్కి

బంగ్లాదేశ్ నుండి అత్యవసరం కానీ దౌత్య సిబ్బంది వెనక్కి
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో బంగ్లాదేశ్‌లోని  హైకమిషన్‌, కాన్సులేట్స్‌ నుంచి అత్యవసరం కాని సిబ్బందిని, వారి కుటుంబాలను ఢాకా నుంచి వెనక్కిపిలిపించాలని భారత్‌ నిర్ణయించింది. అయితే హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, హైకమిషన్‌ యధావిధిగా పనిచేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
 
కాగా  బంగ్లాదేశ్ కల్లోలిత ప్రాంతంగా మారింది. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో 205 మంది భారతీయులు బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్నారు. వీరిని తీసుకు వచ్చేందుకు మంగళవారం రాత్రి ఈ ప్రత్యేక విమానాన్ని ప్రభుత్వం ఢాకా పంపింది. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఢాకా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఆరుగురు నవజాత శిశువులు ఉన్నారని తెలిపారు.
 
మరోవైపు ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్‌ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.
 
ఎయిర్ ఇండియా అయితే ముంబయి, ఢిల్లీ, చెన్నయి మహానగరాల నుంచి ఢాకాకు ఓ సర్వీస్ నడుపుతుందని పేర్కొంది. ఇక కోల్‌కతా నుంచి ఢాకాకు ప్రతీ రోజు రెండు సర్వీసులు నడుస్తున్నాయని వివరించింది. మంగళవారం అంటే నిన్న మాత్రం ఇండిగో, విస్తారా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆ సంస్థ గుర్తు చేసింది.