మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం?

మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం?

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించనున్నారు. సుదీర్ఘకాలం బంగ్లాదేశ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్‌ హసీనా సోమవారం రాజీనామా చేసేవిధంగా నిరసన ఉద్యమాలను విదేశాలలో ఉంటూ ప్రోత్సహించడంలో కీలకపాత్ర వహిస్తున్న ఆయన పేరును విద్యార్థి నేతలు తెరపైకి తెచ్చారు.

 కోటాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ప్రభుత్వంకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంగా మారడానికి నాయకత్వం వహించిన సోషియాలజీ విద్యార్థి నహీద్‌ ఇస్లామ్‌ (26) యూనస్‌ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు ఓ వీడియోలో పేర్కొన్నారు. యూనస్‌ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాల్సిందిగా బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ను అభ్యర్థిస్తున్నట్లు ఇస్లామ్‌ తెలిపారు.

ఆర్మీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని విద్యార్థులు ఆమోదించరని స్పష్టం చేశారు. ఉద్యమ నిర్వాహకులు నేడు ఆర్మీ అధికారులతో సమావేశమవనున్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉండేందుకు నోబ్‌లె శాంతి బహుమతి గ్రహీత యూనస్‌ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి పారిస్‌లో చిన్నపాటి వైద్య ప్ర్రక్రియ  అనంతరం ఆయన బంగ్లాదేశ్‌కు రానున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

బంగ్లాదేశ్‌లో 17 రోజుల తర్వాత మంగళవారం కర్ఫ్యూని ఎత్తివేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్‌, ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయని ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. జూలై 19న దేశంలో కర్ఫ్యూ విధించారు.

అంతకుముందు సోమవారం అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఓ కీలక ప్రకటనలో సాధ్యమైనంత త్వరగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనికంటే ముందు షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి, విపక్ష నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి ఖాలెదా జియాను హౌస్ అరెస్టు నుంచి విడుదల చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

యూనస్‌ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో 1940లో జన్మించారు. ఆయన ఒక బ్యాంకర్‌, ఆర్థికవేత్త, పౌర సమాజ నేతగా ఉన్నారు. మైక్రోక్రెడిట్‌, మైక్రో ఫైనాన్స్‌లో చేసిన మార్గదర్శక కృషికి  గాను నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు. దీంతో ఆయన అంతర్జాతీయ గుర్తింపును పొందారు. నోబెల్‌ బహుమతితో పాటు  యూనస్‌ 2009లో యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌,  2010లో కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌తో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 

అలాగే 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గా పనిచేశారు.  గతంలో చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గానూ పనిచేశారు.  కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు యూనస్‌కు ఈ ఏడాది జనవరిలో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.