
ఇటీవల ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మృతి చెందారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ సెంటర్లు మృత్యు గదులుగా మారి చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నాయని సుప్రీంకోర్టు ఆరోపించింది.
రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో గత నెల 27 శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో సివిల్స్ అభ్యర్థుల మృతిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ఘటన ఓ కనువిప్పు లాంటిదని పేర్కొంది. అన్ని భద్రతా ప్రమాణాలను పాటించే కోచింగ్ సంస్థలకే అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రావూస్ ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
కాగా, పౌర, అగ్నిమాపక భద్రతా తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి కోచింగ్ సెంటర్లు వ్యాపారాలు చేస్తున్నాయని, వాటన్నింటిని మూసివేయాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను సవాల్‌చేస్తూ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫెడరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ విషాదాన్ని సుమోటోగా స్వీకరించింది.
కోచింగ్ సెంటర్లు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాయి అని సుప్రీం ఆరోపించింది. ఈ సందర్భంగా ఐఏఎస్ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వందలాది కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి విద్యార్థుల నుంచి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి కోచింగ్ సెంటర్‌లకు ఎలాంటి నిబంధనలు విధించారో చెప్పాలని కోర్టు కోరింది.
ఈ ఘటన జరిగిన తర్వాత కూడా సురక్షితమైన వాతావరణాల్లో ఈ కోచింగ్ సెంటర్లు నడవడం లేదు. గౌరవప్రదమైన జీవితం కోసం భద్రత కోసం కోచింగ్ సెంటర్లు ప్రాథమిక నిబంధనలను పూర్తిగా పాటించకపోతే ఎలా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
కోచింగ్ సెంటర్లు ఔత్సాహికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం పేర్కొంది. కోచింగ్ సెంటర్‌లకు సరైన వెంటిలేషన్, సురక్షితమైన ప్రవేశాలు, నిష్క్రమణలు ఉండాలి అని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది.
More Stories
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
మూడో తరగతి నుంచే ఏఐ!
వాట్సప్ లేకపోతేనేం.. అరట్టై వాడండి