బ్రహ్మపుత్రపై డ్రాగన్ ‘సూపర్ డ్యామ్’తో భారత్‌కు ముప్పు!

బ్రహ్మపుత్రపై డ్రాగన్ ‘సూపర్ డ్యామ్’తో భారత్‌కు ముప్పు!

భారత ప్రధాన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం (సూపర్ డ్యామ్) నిర్మాణానికి జిన్‌పింగ్‌ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు నష్టమని తెలిసినప్పటికీ ఈ భారీ సూపర్‌ డ్యామ్‌ నిర్మాణానికి తయారు అయినట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో స్తబ్దుగాఉన్న చైనా మరోసారి ఆ దిశగా చైనా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

 ఈ మేరకు ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఓ నివేదిక విడుదల చేసింది. చైనా ఎత్తుగడలకు సంబంధించిన కీలక అంశాలను ఏఎస్పీఐ తన నివేదికలో పొందుపరిచింది. బ్రహ్మపుత్ర నది భారత్‌లోకి ప్రవేశించే ముందు అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది. ఈ వంపు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా పావులు కదుపుతున్నట్లు ఏఎస్పీఐ నివేదించింది. 

బ్రహ్మపుత్ర నది అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశించడానికి ముందు సుమారు 3వేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగానూ చైనాకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీలుండటం వల్ల ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తున్నట్లు ఏఎస్పీఐ తెలిపింది. ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్‌ ప్రాజెక్టుగా దీనిని డ్రాగన్ అభివర్ణిస్తోంది.

ఒక వేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్‌కు పక్కలో బళ్లెంలా మారే ప్రమాదముందని ఏఎస్పీఐ హెచ్చరించింది. ఈ ప్రాజెక్టుతో ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. దీంతో అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరించింది. 

అటు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా నీటి ప్రవాహం ఉంటుంది. ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. చైనా నిర్మించాలని అనుకుంటున్న ప్రాజెక్టు భారత్‌-చైనా సరిహద్దుకు కేవలం 30కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్‌కు సమస్యలు పొంచి ఉన్నాయని నివేదించింది. 

ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్‌ బాంబ్‌గా ఉపయోగించుకునే వీలుందని తెలిపింది. టిబెట్‌లో జన్మించే బ్రహ్మపుత్ర నది భారత్‌ గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. అక్కడ గంగానది దీంతో కలుస్తుంది. 

వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో అపారనష్టాన్ని కలగజేస్తుంటాయి. ఈ నదీ జలాల ప్రవాహతీరు, పంపిణీ, నాణ్యత సమాచార మార్పిడిపై భారత్‌, చైనా మధ్య ఒప్పందం ఉంది. ముఖ్యంగా వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాల్ని దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. 

కానీ, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్‌కు సరిగా ఇవ్వడంలేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. 

ఇరుదేశాల మధ్య. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం జరగలేదు. ఈ నేపథ్యంలో సూపర్‌ డ్యామ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవుతుండటం కలవరపెడుతోంది. దిగువ ఉన్న దేశాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా బ్రహ్మపుత్ర నదిపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గత ఏడాది చైనాను భారత ప్రభుత్వం వారించింది.