విదేశాల్లో ఉద్యోగాల పేరిట రూ.200 కోట్ల మోసం

విదేశాల్లో ఉద్యోగాల పేరిట రూ.200 కోట్ల మోసం
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3,400 మంది వద్ద రూ.200 కోట్ల మేర మోసానికి పాల్పడిన నలుగురిని పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వెలువడిన ఓ ప్రకటన చూసిన పుదుచ్చేరి లాస్‌పేటకు చెందిన రమేష్‌కుమార్‌ మొబైల్‌ఫోన్‌లో అగంతకులను సంప్రతించాడు. సదరు వ్యక్తి కెనడాలోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. వీసా, వైద్య పరీక్షలు, ఇన్సూరెన్స్‌ తదితరాల కోసమంటూ రూ.17.71 లక్షలు తీసుకున్నాడు. 
 
ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాక ఏడాది గడిచినా అటు నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించిన రమేష్‌కుమార్‌ పుదుచ్చేరి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ క్రైం డీఎస్పీ కలైవానన్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు కీర్తి, త్యాగరాజన్‌ కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. రెండు నెలలపాటు జరిగిన విచారణలో కోల్‌కతా కేంద్రంగా మోసం జరిగినట్టు గ్రహించారు.
 
అక్కడకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శుభం శర్మ (29), నీరజ్‌ గుర్జార్‌ (28), వారి స్నేహితుడు బీహార్‌కు చెందిన దీపక్‌కుమార్‌ (28), ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాజ్‌గౌండ్‌ (23) ఈ మోసానికి పాల్పడ్డారని, వారు ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో, బెంగుళూరు వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం ఆ నలుగురినీ అరెస్టు చేసి పుదుచ్చేరికి తరలించారు. 
 
శుభం శర్మ నేతృత్వంలోని ఈ ముఠా దేశవ్యాప్తంగా 3,400 మందికి పైగా విదేశీ ఉద్యోగాల పేరిట మోసం చేసినట్టు విచారణలో తేలింది. సుమారు రూ.200 కోట్ల మేరకు మోసం చేసినట్టు ఆ ముఠా పేర్కొన్నట్టు సమాచారం. వీరి కోసం కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఢిల్లీ, అస్సోం, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల పోలీసులు కూడా గాలిస్తున్నట్టు తెలిసింది. 
 
అలాగే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజంఖాన్‌ నేతృత్వంలో శుభం శర్మ బృందం పని చేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. వారి నుంచి 21 సెల్‌ఫోన్లు, 2 పాస్‌పోర్ట్‌లు, 42 సిమ్‌కార్డులు, 1 ల్యాప్‌టాప్‌, 64 ఏటీఎం కార్డులు, రూ.41 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించిన పోలీసులు, ప్రధాన సూత్రధారి అజంఖాన్‌ కోసం గాలిస్తున్నారు.