కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు రూ. 5 లక్షల కోట్ల నష్టం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు రూ. 5 లక్షల కోట్ల నష్టం
అమెరికాలో వెలువడిని ఫ్యాక్టరీ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తుండడంతో మదుపర్లలో బెరుకు మొదలయింది. అంతేకాక ఆసియా మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఒక్క సెషన్ లోనే మదుపర్ల రూ. 5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. జపాన్ మార్కెట్ కూడా బాగా క్రాష్ అయింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ లు సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం 1 శాతానికి పైగా పతనమయ్యాయి.
సెన్సెక్స్ 81,867.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 1 శాతానికి పైగా క్షీణించి 80,868.91 వద్ద ముగిసింది.  నిఫ్టీ 25,010.90 పాయింట్ల వద్ద ప్రారంభమై 1 శాతానికి పైగా క్షీణించి 24,686.85 వద్ద ముగిసింది. చివరకు సెన్సెక్స్ 886 పాయింట్లు లేదా 1.08 శాతం నష్టంతో 80,981.95 వద్ద, నిఫ్టీ 293 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టంతో 24,717.70 వద్ద ముగిశాయి.

బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.19 శాతం, 0.58 శాతం క్షీణించాయి. మార్కెట్ పతనంతో శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 5 లక్షల కోట్లను నష్టపోయారు. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం సెషన్లో దాదాపు రూ. 462 లక్షల కోట్లు ఉండగా, శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి రూ. 457 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు కేవలం ఒక సెషన్లో సుమారు 5రూ. లక్షల కోట్లను కోల్పోయారు.

నిఫ్టీ 50 సూచీలో 42 షేర్లు ఎరుపు రంగులో ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, మారుతి షేర్లు టాప్ లూజర్స్ గా ముగిశాయి. అస్థిరత సూచీ ఇండియా విఐఎక్స్ 11 శాతానికి పైగా పెరిగి 14.41 కు చేరుకుంది. ఇది మార్కెట్ భాగస్వాములలో పెరుగుతున్న భయాందోళనలను సూచిస్తుంది. 

ప్రధాన సెక్టోరల్ ఇండెక్స్ లలో నిఫ్టీ రియల్టీ 3.5 శాతం, ఆటో, మెటల్ దాదాపు 3 శాతం చొప్పున నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.41 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.39 శాతం క్షీణించాయి. మరోవైపు పీఎస్ యూ బ్యాంక్ ఇండెక్స్ 1.72 శాతం నష్టపోయింది.