స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన

స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన

యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడమే లక్ష్యంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ‌లం మీర ఖాన్ పేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు.

కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. 

దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువతతో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. “న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో రైలును విస్తరించడం, ఆ తర్వాత దాన్ని నెట్‌ జీరో సిటీ వరకు పొడగిస్తాం. ఆ ప్రాంతం వరకు 200 అడుగులతో రోడ్డు మార్గాన్ని నిర్మించటం జరుగుతుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

యుంగ్ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదన్న రేవంత్‌ దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్‌ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు. 

ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం 6కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్‌కు అవకాశం ఇస్తున్నామని చెప్పారు.  శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. భవిష్యత్‌లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని వివరించారు.

ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు.