నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలు మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడినందుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం సభకు హాజరయ్యారు.  ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  
 
సభలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే మంత్రి శ్రీధర్‌ బాబు స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.
అంతకు ముందు, మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.
 
ఎమ్మెల్యేల గౌరవం, ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ముఖ్యమంత్రి మాట్లాడారని, ఈ అంశంపై శాసన సభలో చర్చించాలని పేర్కొంటూ అసెంబ్లీ కార్యదర్శికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నోటీలులు అందజేశారు. కాగా, సభలో గట్టిగా నినాదాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని శ్రీధర్‌బాబు హితవు చెప్పారు. సభలో బీఆర్​ఎస్​ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
యువత ప్రయోజనం కంటే బీఆర్​ఎస్​కు రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అనుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ యువత భవిష్యత్‌ కోసం బిజెపి సభ్యులు సభానిర్వహణలో సహకరిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర యువత బీఆర్​ఎస్ సభ్యుల చేష్టలను గమనిస్తుందని హెచ్చరించారు.
 
స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదన మండిపడ్డారు. స్కిల్ వర్సిటీలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లను పెట్టాలని కోరారు. గత ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెబుతూ ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కోసం రూ.12లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
 
సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించాలని బీఆర్​ఎస్​ పట్టుబడింది. దీంతో సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్‌ తెలిపారు. స్కిల్‌ వర్సిటీ బిల్లుపై చర్చకు సహకరించాలని బీఆర్​ఎస్​ సభ్యులకు స్పీకర్‌ సూచించారు.
 
అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం, కేటీఆర్‌ మధ్య సంవాదం కొనసాగుతున్న సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (గతంలో అధికారపక్షంలో) ఉండి చెప్పీ చెప్పీ ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నడనుకో జూబ్లీ బస్టాండులో కూర్చోవాల్సి వస్తది’ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి.