చార్మినార్ గడియారానికి ఏమైంది?

చార్మినార్ గడియారానికి ఏమైంది?
హైదరాబాద్‌ అనగానే మనసులో మెదిలే చారిత్రక కట్టడం చార్మినార్‌కు ఉన్న గడియారం పగిలిపోయింది. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడు ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో ఈ చార్మినార్ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 
 
చార్మినార్ కు ఉండే గోడ గడియారం 135 ఏళ్ల పురాతనమైంది. కానీ దానికిప్పుడు ముప్పు వచ్చింది.  గడియారం బ్యాక్ గ్రౌండ్ లో తెలుపు భాగం దెబ్బతిన్నది. 25 నిమిషాలు చూపే చోట గడియారానికి రంధ్రం పడింది.  ఆ గడియారాన్ని వాహిద్ వాచ్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ కంపెనీ వారసులతో కలిసి ఏ మేరకు ధ్వంసం జరిగిందో చూస్తామని ఉద్యోగి ఒకరు తెలిపారు. 
 
మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప పైప్‌లు తీస్తున్న సమయంలో.. అనుకోకుండా గడియారానికి తగిలాయి. దీంతో గడియారంలోని డయల్‌ బోర్డు పగిలిపోయింది. అయితే పావురాల వల్లే ఈ డ్యామేజ్ జరిగిందని మరొకొందరు భావిస్తున్నారు. ఎలా జరిగినప్పటికీ గడియారం పాక్షికంగా ధ్వంసమైనా పనిచేస్తూ సరైన సమయాన్ని సూచిస్తుండటం గమనార్హం. 
 
ఈ విషయాన్ని గమనించిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు చేపట్టింది. డయల్‌ బోర్డు కొత్తది ఏర్పాటు చేయడం కొంచెం కష్టమైన పని కావటంతో దెబ్బతిన్న దగ్గరే మరమ్మతులు చేస్తున్నారు ప్రారంభించారు. చార్మినార్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గడియారం పగిలిపోవడంతో అధికారులు అప్రమత్తమై భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
 
చార్మినార్‌కు నాలుగు మినార్లే కాదు, నాలుగు వైపులా గడియారాలు కూడా ఉంటాయి. 1889లో చార్మినార్‌కు నలువైపులా గడియారాలను అమర్చారు. ఈ గడియారాలను నాటి పాలకులు లండన్‌ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. నేటికీ ఆ గడియారాలు సమయాన్ని సక్రమంగా తెలియజేస్తున్నాయి. ప్రతి 24 గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇస్తుంటారు.