
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ విచారణ చేపట్టింది. 65 శాతం కోటాపై తాత్కాలిక ఆదేశాలు ఏమీ ఉండవని, ఈ కేసును సెప్టెంబర్‌లో తుది విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఉద్యోగం, విద్య అంశాల్లో సమానత్వ హక్కును బీహార్ సర్కారు ఉల్లంఘించిందని కొందరు హైకోర్టులో పిటీషన్ వేశారు.
దీంతో ఈ ఏడాది జూన్ 20వ తేదీన హైకోర్టు 65 శాతం కోటా చట్టాన్ని నిలిపివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 అతిక్రమించినట్లు అవుతుందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గ ప్రజలు తక్కువ సంఖ్యలో ఉన్నారని, అందుకే 1991 నాటి రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని గత ఏడాది బీహార్ సర్కారు తీర్మానించింది.
దీంతో రిజర్వ్డ్ క్యాటగిరీల్లో రిజర్వేషన్‌ను 65 శాతానికి పెంచారు. అయితే దీని వల్ల మెరిట్ క్యాటగిరీలో కోటా 35 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్ ఆధారంగా బీసీలు ఎక్కువే ఉద్యోగాలు పొందినట్లు ఓ సర్వే రిపోర్టును హైకోర్టు అంగీకరించింది. అందుకే రిజర్వేషన్ అంశంపై పునరాలోచించాలని హైకోర్టు తన తీర్పులో చెప్పింది.
పాట్నా హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని కోరుతూ బీహార్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ బీహార్ ప్రభుత్వం తరపున వాదించారు. అయినా కోర్టు మాత్రం ఆయన వాదనను వినిపించుకోలేదు. తాత్కాలిక రిలీఫ్ ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు. చత్తిస్ ఘర్ లో ఆ విధమైన స్టే ఇచ్చారని న్యాయవాది గుర్తు చేయగా, ఇప్పటికే బీహార్ లో ఈ వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ సర్వీస్ లలో 68 శాతం వరకు ఉన్నారని హైకోర్టు పేర్కొన్నదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గుర్తు చేశారు.
కూలుతున్న బ్రిడ్జ్ లపై సుప్రీం నోటీసులు
ఇలా ఉండగా, బీహార్ లో వరుసగా బ్రిడ్జిలు కూలిన ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ బీహార్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అన్ని వంతెనలు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలపై అత్యున్నత స్థాయి స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించాలని సూచించింది.
అదేవిధంగా సాధ్యాసాధ్యాలను బట్టి బలహీనమైన నిర్మాణాలను కూల్చివేయడం లేదా పునర్నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, సివాన్, సరన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో ఇటీవలే పదుల సంఖ్యలో వంతెనలు కుప్పలకూలిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని వంతెనలు పాతవి కాగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు. భారీ వర్షాల కారణంగా ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయాయి. దీంతో బ్రిడ్జిల నాణ్యతపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
More Stories
దగ్గు మందుతో చిన్నారుల మృతికి కారణమైన డాక్టర్ అరెస్ట్
ఆత్మపరిశీలన, పునఃసమర్పణకు అవకాశంగా ఆర్ఎస్ఎస్ వందేళ్లు
‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్లు కాదు, శాంతిభద్రతల సమస్య