
* బోగస్ క్లెయిమ్‌లు చేయడం క్రిమినల్ నేరం
విదేశీ ప్రయాణాలకు పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్లను పొందడం తప్పనిసరి చేసిన బడ్జెట్ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో, ప్రతిపాదిత సవరణ భారతదేశంలోని నివాసితులందరికీ కాదని ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. ఆర్థిక అవకతవకలు లేదా గణనీయమైన పన్ను బకాయిలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మాత్రమే అటువంటి క్లియరెన్స్ అవసరమని తెలిపింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక బిల్లు-2024లో బ్లాక్ మనీ యాక్ట్, 2015 సూచనను చట్టాల జాబితాలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని కింద ఎవరైనా పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందేందుకు తన బకాయిలు క్లియర్ చేయాలంది.
కొన్ని సందర్భాల్లోనే ఆదాయపన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం. అవి ఎలాంటివంటే: తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం లేదా సంపద పన్ను చట్టం కింద విచారణకు హాజరు కావలసిన వ్యక్తి, డైరెక్ట్ ట్యాక్స్ యెరియర్స్ రూ. 10 లక్షలకు పైగా బాకీ ఉన్న వ్యక్తి ట్యాక్స్ క్లియరెన్స్ పొందలేరు. విదేశాలకు వెళ్లడం సాధ్యపడదు.
కాగా, ఐటి శాఖ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలర్లను ఖర్చుల కోసం బోగస్ క్లెయిమ్‌లు చేయవద్దని, వారి ఆదాయాలను తక్కువగా నివేదించవద్దని లేదా తగ్గింపులను అధికం చేయవద్దని కోరింది. ఇది శిక్షార్హమైన నేరం , రీఫండ్‌ల జారీలో జాప్యం కలిగిస్తుందని పేర్కొంది. ఆడిట్ చేయాల్సిన అవసరం లేని ఖాతాదారుల అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25 ఐటిఆర్ ఫైలింగ్ సీజన్ చివరి తేదీ జూలై 31న ముగుస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ , దాని అడ్మినిస్ట్రేటివ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) ప్రకారం, జూలై 26 నాటికి ఐదు కోట్లకు పైగా ఐటిఆర్‌లు దాఖలయ్యాయి. ఐటిఆర్ సమర్పించే పన్ను చెల్లింపుదారులు మూలం వద్ద పన్ను కోత(టిడిఎస్) తిరిగి పొండం(రీఫండ్) కోసం ఎక్కువ, తక్కువ చేసి చూపకూడదని ఐటి శాఖ హెచ్చరించింది.
పన్ను చెల్లింపుదారులు సరైన, తప్పులు లేని వివరాలనే పేర్కొనాలని తెలిపింది. తప్పుడు క్లయిములు చేస్తే శిక్షార్హులవుతారని హెచ్చరించింది. కొత్త పన్ను విధానంలో పన్ను విధానాన్ని మెరుగ్గా, సులభరీతిలో రూపొందించామని సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్ ఇటీవల పిటిఐకి తెలిపారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు