రాజస్థాన్ సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు

రాజస్థాన్ సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను హత్య చేస్తామంటూ జైపూర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ రావడం కలకలం రేపింది.  ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని గుర్తించినట్లు ఏసీపీ లోకేశ్ సోన్‌వాల్ వెల్లడించారు. అతడి వద్ద నుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొబైల్ ఫోన్లతోపాటు సిమ్ కార్డులు సైతం సీజ్ చేశామని చెప్పారు. 
 
ఈ బెదిరింపు పోన్ కాల్ దౌసాలోని శైలవాస్ సెంట్రల్ జైలు నుంచి వచ్చిందని పేర్కొన్నారు. ఆ క్రమంలో జైల్లో ముమ్మర తనిఖిలు నిర్వహించామని, అందులోభాగంగా భూమిలో దాచిన తొమ్మిది మొబైల్ ఫోన్లను గుర్తించామని వివరించారు.  సీఎం హత్యకు సంబంధించిన బెదిరింపు ఫోన్ కాల్ దౌసాలోని సెంట్రల్ జైల్ ప్రాంతం నుంచి వచ్చిందంటూ ఆదివారం ఉదయం రాజధాని జైపూర్‌లోని ఉన్నతాధికారులు తమకు సమాచారం ఇచ్చాని ఏసీపీ సోన్‌వాల్ చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేపట్టామని చెప్పారు. 
 
ఆ క్రమంలో శైలవాస్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ నిందితుడు ఈ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించామని వెల్లడించాయిరు. అయితే  భద్రత కారణాల దృష్ట్యా పేరు వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.  సదరు నిందితుడు పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ వాసి అని తెలిపారు. అతడు గతంలో అరెస్ట్ అయి 376 సెక్షన్ కింద జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు. మరోవైపు నిందితుడిని డివిజనల్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సమక్షంలో విచారించామని పేర్కొన్నారు. 
 
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను చంపేస్తామంటూ రాజధాని జైపూర్‌లోని కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ వెళ్లింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై విచారణ జరపాలంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ఇంకోవైపు ఈ నిందితుడు రేప్ కేసులో అరెస్టయినట్లు తెలుస్తుంది.
 
 జైల్లోకి తొమ్మిది సెల్ ఫోన్లు ఎలా వేళ్లాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వారిలో జైలు సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరిపై సస్పెన్షన్ వేటుతోపాటు ఇంకోందరిపై బదిలీ చేసే అవకాశముందని తెలుస్తుంది.