
దేశరాజధాని ఢిల్లీలో సివిల్స్ కోచింగ్‌కు వెళ్లిన ముగ్గురు భారీ వర్షాలకు బలయ్యారు. భారీ వర్షాల కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లో రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద పోటెత్తింది. దీంతో అందులో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీటమునిగారు.
సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది 30 మందిని రక్షించగా, మరో ముగ్గురు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్ (25), నవిన్ డాల్విన్ (28)గా గుర్తించారు. వారు ముగ్గురూ కేరళ, తెలంగాణ, యుపీలకు చెందినవారు.
శనివారం సాయంత్రం 7.15 గంటలకు ఓల్డ్ రాజిందర్ నగర్‌లో ఉన్న రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు సమాచారం వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు. వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని, అప్పటికే బేస్‌మెంట్ మొత్తం నీటితో నిండి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాలను వెలికి తీశామని వెల్లడించారు.
ఈ దుర్ఘటనపై క్రిమినల్ కేసు నమోదుచేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారి హర్షవర్ధన్ చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలిని సందర్శించిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా, ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్ పాలనపై విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజీలను శుభ్రం చేయించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అందుకు బాధ్యత వహించి మంత్రి ఆతిశీ, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్.. ఘటనా ప్రాంతానికి వెళ్లారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వాతిమాలివాల్‌పై మండిపడ్డారు. విషయాన్ని రాజకీయం చేయవద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. అయితే కొందరు విద్యార్థుల మద్దతుతో ఆమె అక్కడ బైఠాయించడంతో మిగతా విద్యార్థులు స్వాతిమాలివాల్ ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దాంతో అక్కడ గందరగోళం నెలకొంది.
ఈ ఘటనపై 24 గంటల్లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని చెప్పారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా