ఢిల్లీ వరదల్లో తెలంగాణ విద్యార్థిని సోని మృతి

ఢిల్లీ వరదల్లో తెలంగాణ విద్యార్థిని సోని మృతి
ఢిల్లీలో రాజేంద్రనగర్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే(25) ఏళ్ల యువతి కూడా ఉన్నారు. ఆమె సంవత్సర కాలంగా ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. సోని స్వస్థలం బీహార్ కాగా, ఆమె తండ్రి విజయ్ కుమార్ తెలంగాణ సింగరేణిలో.. శ్రీరాంపూర్-1 భూగర్భగని మేనేజర్‌గా పని చేస్తున్నారు.
 
భార్య, మరో కుమార్తెతో కలిసి లక్నోకు రైలులో వెడుతుండగా నాగపూర్ వద్ద వారికి కుమార్తె మరణం విషయం తెలిసింది. వెంటనే అక్కడే రైలు దిగి విమానంలో  ఢిల్లీకి బయలుదేరారు. తమ కుమార్తె ఎన్నో కలలతో, ఎంతో పట్టుదలతో కోచింగ్ తీసుకొంటున్నారని వారు గుర్తు చేస్తుకున్నారు.  ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందిన ఆమె సివిల్ సర్వీసెస్ కు ఎంపిక కావాలని పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు.
 
సోని మృతి చెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  భౌతికకాయం వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తిచే యడంలో చొరవ తీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయ సిబ్బందిని కిషన్ రెడ్డి ఆదేశించారు.

ఢిల్లీ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీలో జరిగిన విధంగా తెలంగాణలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండానే నడుపుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీలో ఎక్కువగా అవినీతి జరుగుతోందని, అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వాటిపైన జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలని కోరారు.

కాగా, సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌, బిల్డింగ్ మేనేజిమెంట్‌, ఆ ప్రాంతంలో డ్రైనేజ్ మేనేజిమెంట్‌కు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సెంట్రల్ ఎం.వర్షవర్ధన్ తెలిపారు.