
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుత ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు.
ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్‌గా నియమించి, మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పంజాబ్ గవర్నర్‌గా పనిచేసిన బన్వరిలాల్ పురోహిత్ స్థానంలో గులాబ్ చంద్ కటారియా నియమితులయ్యారు. పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్రపాలిత ప్రాంతమైన ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా గులాబ్ చంద్ కటారియాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
సిక్కిం కొత్త గవర్నర్ గా బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాశ్ మాథుర్ నియమితులయ్యారు. కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న రమేష్ బైస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేబడతాటారు. సీ.పీ.రాధాకృష్ణన్ ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్ గా ఉంటూ తెలంగాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఝార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ స్థానంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన మాజీ ఐఏఎస్ అధికారి కె.కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కైలాసనాథన్ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత దశాబ్దానికి పైగా ఈ పదవిలో కొనసాగిన ఆయన ఎట్టకేలకు జూన్ 30న పదవి నుంచి వైదొలిగారు.
రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా స్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిభావ్ కిసాన్ రావ్ బాగ్డే నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ పదవిని అసోంకు చెందిన మాజీ లోక్ సభ సభ్యుడు రామెన్ డేకా చేపట్టనున్నారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు సీహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా వ్యవహరిస్తారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి