
* నీతి ఆయోగ్ కు 10 మంది ముఖ్యమంత్రులు గైరాజర్
అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలంగా మన విధానాలు మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వికసిత్ భారత్ -2024 విజన్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు శనివారం జరిగిన నీతి ఆయోగ్ తొమ్మిదో పాలక మండలి సమావేశంకు అధ్యక్షత వహిస్తూ ఇండియా యువశక్తి నిండిన దేశమని, దేశ మానవ వనరులు యావత్ ప్రపంచానికి ఆకర్షణగా నిలిచాయని చెప్పారు.
రాష్ట్రాలు, ప్రజలతో నేరుగా అనుసంధానం అయి ఉన్నందున, ఈ లక్ష్యాన్ని సాధించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ దశాబ్దం మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భారత్‌ను అభివృద్ ధిచెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక అడుగు అని పేర్కొన్నారు. మనం సరైన దిశలోనే పయణిస్తున్నామని వందల ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని వెల్లడించారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన, రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్-2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వికసిత్ రాష్ట్రాలు, వికసిత్ భారత్‌ను తీర్చిదిద్దుతాయని తెలిపారు.
సమావేశం అనంతరం వివరాలను నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాకు వెల్లడించారు. “వచ్చే 25 ఏళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అయ్యే ప్రణాళికపై చర్చించాం. దేశంలో ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనపై చర్చించాం. వికసిత్ భారత్‌పై కేంద్రం రూపొందించిన డాక్యుమెంట్‌ను వివరించాం” అని తెలిపారు.
వికసిత్ భారత్ సాధించడంలో రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యం అని చెబుతూ రాష్ట్రాలు అమలు చేయాల్సిన ప్రణాళికలపై సూచనలు చేశామని చెప్పారు. వైద్యరంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై విస్తృతంగా చర్చించామని పేర్కొంటూ సైబర్ సెక్యూరిటీలో అమలు చేయాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించామని తెలిపారు.
అభివృద్ధి విషయంలో రాష్ట్రాల ప్రణాళికలు కూడా నీతి ఆయోగ్ శ్రద్ధగా విన్నది. కొన్ని రాష్ట్రాల సూచనలు, వారి ప్రణాళికలు చాలా బాగున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా పది రాష్ట్రాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ఎవరూ పాల్గొనలేదని సీఈవో వివరించారు.
ఏడుగురు ముఖ్యమంత్రులు బహిష్కరణ
ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏడుగురు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తనను అవమానించారంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ.రేవంత్ రెడ్డి (తెలంగాణ), సిద్ద రామయ్య (కర్ణాకట), సుఖ్వీందర్ సింగ్ సుఖ్ (హిమాచల్‌ప్రదేశ్) నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేమని ప్రకటించారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీహార్ జైల్‌లో ఉండటం వల్ల ఆయన కూడా హాజరుకాలేరు.
కేంద్రంలో అధికార ఎన్‌డిఎ కూటమికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పుదిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో హాజరు కాలేకపోయారని చెబుతున్నారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు