
రాష్ట్ర విభజనపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి మజుందార్ మాట్లాడుతూ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంత జిల్లాలకు, ఈశాన్య రాష్ర్టాలకు ఉన్న పోలికలు గురించి ప్రధాని మోదీని కలిసి వివరించినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలను ఈశాన్య రాష్ర్టాల్లో కలపాలని కోరానని తెలిపారు. అదే సమయంలో కూచ్ బెహార్‌ను దక్షిణ బెంగాల్ నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం చేయాలని బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్ డిమాండ్ చేశారు.కాగా, బెంగాల్ విభజన గురించి బీజేపీ ఇలా డిమాండ్ చేయడం ఇది తొలిసారి కాదు. ఉత్తర బెంగాల్ ప్రాంతం చాలాకాలంగా రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నదని, దానిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని 2021లో అప్పటి కేంద్ర మంత్రి జాన్ బర్లా డిమాండ్ చేశారు.
అదే ఏడాది వేసవి వేడిమి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించగా, తమకు వాతావరణం చల్లగా ఉందని, సెలవులు అక్కర్లేదని పేర్కొంటూ, అందుకే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నట్టు సిలిగురి ఎమ్మెల్యే ఘోష్ కోరారు. అలాగే డార్జిలింగ్ హిల్స్‌ను బెంగాల్ నుంచి విడదీయాలని ఒక ఎమ్మెల్యే, జంగల్ మహల్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని మరో ఎంపీ డిమాండ్ చేశారు.
కాగా, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెల్చుకున్న 12 సీట్లలో ఆరు ఉత్తర బెంగాల్ ప్రాంతానివి కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఏడు సీట్లను నెగ్గింది. దీంతో బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతం కన్నా ఇక్కడ ఆ పార్టీ దృష్టి కేంద్రీకరిస్తున్నది.
రాష్ట్ర విభజన తమ లక్ష్యం కాదని, రాష్ట్రం మొత్తం అభివృద్ధినే తాము కోరుంటున్నట్టు ఆ పార్టీ ఎంపీ సమిక్ భట్టాచార్య చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఆ పార్టీ లక్ష్యం వేరే ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నదని, అందులో భాగంగానే ఈ విభజన అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌ను విభజించేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్‌ను విభజించడం అంటే దేశాన్ని విభజించడం వంటిదేనని అంటూ తీవ్రపదజాలం వాడారు. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని తేల్చిచెప్పారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు