హామీల అమలుకు ఏటా రూ.9 లక్షల కోట్లు అవసరం

హామీల అమలుకు ఏటా రూ.9 లక్షల కోట్లు అవసరం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏటా రూ.9 లక్షల కోట్లు అవసరం అని చెబుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని బిజేపి శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని విమర్శించారు. 

కేంద్రం నుంచి తెలంగాణకు బడ్జెట్‌లో నిధులు రాలేదని విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొంటూ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదం ఉచ్చరించలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఏ జిల్లాల పేర్లను పలికారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అంశంపై కేంద్రాన్ని కోరగానే, వెంటనే రక్షణ శాఖ భూములను అప్పగించడానికి ఒప్పుకుందని ఆయన గుర్తు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చాలా అంశాలపై సీఎం వద్ద స్వయంగా విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ, తన విజ్ఞప్తులపై రాష్ట్ర బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించలేదు కాబట్టి తాను నిరసన చేస్తే బాగుంటుందా? అని పాయల్ శంకర్ ప్రశ్నించారు. 

రాష్ట్రంలో 64 లక్షల రైతులు రూ.71 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.31 వేల కోట్లు, 44 లక్షల రైతులు అన్నట్లుగా లెక్కలు చెబుతోందని థెయ్ల్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో కౌలు రైతుల ఊసే లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాత్రం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటున్నారని విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పింది తప్పితే జులై నెల ముగుస్తున్నా ఇంకా అమలు చేయడం లేదని పాయల్ శంకర్ విమర్శించారు.  6 నెలల్లో మెగా డీఎస్సీ పేరుతో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారని, ఏడు నెలలు గడిచిపోయిందని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు దొరికేవని, గత పదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్‌లలో నిధులు లేవని పాయల్ శంకర్ తెలిపారు.

ఐటీడీఏలకు నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఉందని హితవు పలికారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోదీని నిందించడం వల్ల ఏం సాధించిందని ప్రశ్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో ఉందనిపిస్తోందని ధ్వజమెత్తారు.  కేంద్ర ప్రభుత్వం రైల్వే కోచ్ ప్యాక్టిరీ ,గిరిజన యూనిర్శిటి ఇచ్చిందని గుర్తు చేశారు. పంటల బీమా పథకం అమలుకు విధివిధానాలు ఖరారు చేయాలని కోరారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని సూచించారు.

రైతులకు రూ.3లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇవ్చాలని,  మైనారిటీల సంక్షేమానికి నిధులు కేటాయించిన విధంగానే హిందువుల సంక్షేమానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పారు. స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.