ఒలింపిక్స్‌లో మెడల్‍తో చరిత్ర సృష్టించిన భారత షూటర్ భాకర్

ఒలింపిక్స్‌లో మెడల్‍తో చరిత్ర సృష్టించిన భారత షూటర్ భాకర్

* రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు …. శుభారంభం చేసిన పీవీ సింధు

ప్రతిష్టాత్మక క్రీడా సమరం పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. ఈ పారిస్ క్రీడాపోటీల రెండో రోజైన ఆదివారం భారత్‍కు తొలి మెడల్ దక్కింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‍లో భారత షూటర్ మనూ భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో షూటింగ్‍ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా 22 ఏళ్ల భాకర్ చరిత్ర సృష్టించారు.
 
చరిత్ర సృష్టించిన భాకర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.  “పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకంతో భారతదేశ పతకాన్ని తెరిచినందుకు మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలు. షూటింగ్ పోటీలో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. మను భాకర్‌ని చూసి భారతదేశం గర్విస్తోంది, ముఖ్యంగా ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ రాష్ట్రపతి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
 
“ఒక చారిత్రాత్మక పతకం! వెల్ డన్, @realmanubhaker , #ParisOlympics2024లో భారతదేశంకు క మొదటి పతకాన్ని గెలుచుకున్నందుకు! కాంస్యానికి అభినందనలు. భారతదేశం తరపున షూటింగ్‌లో పతకం గెలుచుకున్న మొదటి మహిళ కావడం వల్ల ఈ విజయం మరింత ప్రత్యేకమైనది. ఒక అద్భుతమైన విజయం! #Cheer4Bharat” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
 
ఫైనల్‍లో 221.7 పాయింట్లు సాధించిన మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.  ఒలింపిక్స్‌లో షూటింగ్‍లో 12 ఏళ్ల తర్వాత భారత్‍కు పతకం వచ్చింది. చివరగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో వినయ్ కుమార్ రజతం గెలువగ, గగన్ నారంగ్ కాంస్యం దక్కించుకున్నారు. పన్నెండేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఇండియాకు షూటింగ్‍లో పతకం దక్కింది. 
 
మహిళల విభాగంలో మాత్రం వ్యక్తిగతంగా పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా భాకర్ ఘనత దక్కించుకున్నారు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మనూ భాకర్ అనూహ్య రీతిలో వైదొలిగారు. పిస్టల్ మాల్‍ఫంక్షన్ వల్ల వల్ల క్వాలిఫికేషన్ రౌండ్‍లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో మనూ కన్నీరు పెట్టుకున్నారు. 
 

మూడేళ్ల తర్వాత ఇప్పుడు కాంస్య పతకం సాధించి చరిత్ర లిఖించారు. క్వాలిఫికేషన్ రౌండ్‍లో 580 పాయింట్లు సాధించి ఫైనల్ చేరారు మనూ. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన భారత తొలి మహిళా షూటర్‌గా నిలిచారు. ఫైనల్‍లో మూడో ప్లేస్‍లో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు.

మహిళల 10 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్‍లో సౌత్ కొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలిచారు. అదే దేశానికి చెందిన వైజే కిమ్ 241.3 పాయింట్లతో రజతం గెలిచారు. ఇద్దరి మధ్య తేడా కేవలం 0.1 పాయింట్ మాత్రమే. 221.7 పాయింట్లతో మనూ భాకర్ కాంస్య పతకం దక్కించుకున్నారు.

మరోవంక, పారిస్ ఒలింపిక్స్‌ 2024లో తన సమరాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవీ సింధు ఆరంభించారు. ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు గెలిచిన సింధుపై మరోసారి భారీ ఆశలు ఉన్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, గత టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించిన సింధు ఈసారి పారిస్‍లో పసిడి సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. 

ఈ లక్ష్యం దిశగా సింధు తొలి అడుగువేశారు. పారిస్ ఒలింపిక్స్ రెండో రోజు మహిళల సింగిల్స్ గ్రూప్-ఎం మ్యాచ్‍లో ఇండియన్ స్టార్ పీవీ సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవ్స్ ప్లేయర్ ఫాతిమా అబ్దుల్‍పై అలవోక విజయం సాధించారు. మ్యాచ్ అంతా ఆధిపత్యం ప్రదర్శించారు. వరుస గేమ్‍లను కైవసం చేసుకొని 29 నిమిషాల్లోనే సింధు సునాయాసంగా గెలిచారు.