పారిస్ ఒలింపిక్స్‌’కు వెళ్లిన అథ్లెట్లను ఉత్సాహపరచాలి

పారిస్ ఒలింపిక్స్‌’కు వెళ్లిన అథ్లెట్లను ఉత్సాహపరచాలి
మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ‘పారిస్ ఒలింపిక్స్‌’లో ఆడేందుకు వెళ్లిన అథ్లెట్లను ప్రజలంతా ఉత్సాహపరచాలని, అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. 
 
“పారిస్ ఒలింపిక్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు పారిస్ ఒలింపిక్స్ ద్వారా అవకాశం వచ్చింది. దేశానికి ఎప్పటికీ గుర్తిండిపోయే విజయాలు సాధించడానికి వెళ్లిన మన అథ్లెట్లను ప్రోత్సహించండి. భారత్‌ను ఉత్సాహపరచండి’’ అని నరేంద్ర మోదీ చెప్పారు. 
 
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తన రేడియో షో ‘మన్ కీ బాత్’ 112వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లడారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇది రెండవ మన్‌కీ బాత్ ఎపిసోడ్ కాగా.. 2024-25 కేంద్ర బడ్జెట్‌ సమర్పణ అనంతరం మొట్టమొదటి ప్రసంగంగా కావడం విశేషం.
 
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని పునఃప్రారంభించాలని దేశ పౌరులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కోరారు. త్రివర్ణ పతాకంతో ఉన్న తమసెల్ఫీలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని ఆయన కోరారు. “మునుపటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరూ తప్పనిసరిగా భారత జెండాతో కూడిన మీ సెల్ఫీని ‘హర్ ఘర్ తిరంగా’    వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి” అని తెలిపారు. 
 
“నేను మీకు మరో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రతి ఏడాది ఆగస్టు 15 తేదీకి ముందు మీరు నాకు చాలా సూచనలు పంపిస్తారు. దయచేసి ఈ సంవత్సరం కూడా మీ సలహాలు, సూచనలు పంపించండి’’ అని మోదీ కోరారు. ఇక ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తింపు పొందిన అసోంలోని ‘చరైడియో మైదాం’ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ప్రదేశాన్ని తమ భవిష్యత్తు పర్యటన షెడ్యూల్‌లో ప్లాన్ చేసుకోవాలని ప్రజలను ప్రధాని కోరారు.‘‘అసోంలోని చరైడియో మైదాం’ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటుదక్కించుకుంది. ఈ జాబితాలో భారత్ నుంచి ఇది 43వ ప్రదేశంగా ఉంది. అయితే ఈశాన్య భారత్ నుంచి ఇదే తొలి ప్రాంతం. చరైడియో మైదాం ప్రపంచ వారసత్వ ప్రదేశం. యునెస్కో గుర్తింపుతో మరింత పర్యాటకాన్ని ఆకర్షిస్తుంది. మీ భవిష్యత్తు టూర్ ప్రణాళికల్లో ఈ ప్రదేశాన్ని కూడా చేర్చుకోండి’’ అని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారితో ప్రధాన మంత్రి మాట్లాడారు. ‘‘ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో 100 కంటే ఎక్కువ దేశాల నుంచి యువకులు పాల్గొంటారు. మన జట్టు విజయవంతంగా తొలి ఐదు స్థానాల్లో నిలిచింది’’ అని మోదీ ప్రశంసించారు.  దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ విద్యార్థుల పేర్లు పూణేకు చెందిన ఆదిత్య వెంకట్ గణేష్, సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడాకు చెందిన కనవ్ తల్వార్, ముంబైకి చెందిన రుషీల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురిలను మోదీ ప్రస్తావించారు. 

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని మొత్తం 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు 11 విదేశీ భాషలలోకి కూడా తర్జుమా చేసి ప్రసారం చేస్తారు.