
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టయ్యారు. తండ్రి భాస్కరరెడ్డి, తమ్ముడు హర్షిత్‌లతో కలసి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా శనివారం రాత్రి బెంగళూరు దేవనహళ్లి ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో మోహిత్‌పై ఆంధ్ర సిట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బోర్డింగ్ పాస్ చెక్ చేసే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.
ఆయనతో పాటు దుబాయ్ వెళ్లాల్సిన భాస్కర రెడ్డి, హర్షిత్‌రెడ్డి కూడా ప్రయాణం విరమించుకుని మోహిత్ వెంటే ఉన్నారు. అధికారులతో భాస్కరరెడ్డి వాదనకు దిగడంతో తండ్రీకొడుకులు ముగ్గురినీ విమానాశ్రయంలోనే నిర్బంధించారు. బెంగుళూరు విమానాశ్రయం నుంచి పోలీసులు తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి, 41ఎ నోటీసులు ఇచ్చి మోహిత్‌రెడ్డిని వదిలేశారు. విదేశాలకు వెళ్లకూడదని మోహిత్‌రెడ్డికి షరతులు విధించారు.
శనివారం బెంగళూరు నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్‌లో తండ్రి, తమ్ముడితో పాటు దుబాయ్‌కు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 8 గంటలకు ఆ విమానం ఎక్కాల్సి ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయునట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీ అసెంబ్లీ పోలింగ్ మరుసటి రోజు మే 14న తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నేత పులివర్తి నానిపై అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిటిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డి, పలువురితో కలిసి దాడి చేశారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలో రాడ్లు, బీరు సీసాలతో పులివర్తి నాని కార్లపై దాడి చేశారు.
ఈ ఘటనలో పులివర్తి నాని వ్యక్తిగత సహాయకుడు గాల్లోకి కాల్పులు సైతం జరిపారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అవ్వడంతో ఈసీ, అప్పటి సీఎస్, డీజీపీలను దిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తనపై హత్యాయత్నం చేశారని పులివర్తి నాని ఫిర్యాదు చేయడంతో… పోలీసులు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఈ కేసుకు సంబంధించి 37వ నిందితుడిగా చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు.
More Stories
పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం
అఫ్గానిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి
యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్