వికసిత్ భారత్@2047 ప్రతి భారతీయుడి ఆశయం

వికసిత్ భారత్@2047 ప్రతి భారతీయుడి ఆశయం
* మమతా ఆరోపణలు కొట్టిపారేసిన నిర్మలా సీతారామన్

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్క భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండటం వల్ల ఈ ఆశయ సాధనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందని తెలిపారు. పాలకమండలి సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు నీతి ఆయోగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.

నీతి ఆయోగ్ సమావేశంలో ఈ దశాబ్దం మార్పులు, సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌ను అభివృద్ ధిచెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక అడుగు అని పేర్కొన్నారు.

 మనం సరైన దిశలోనే పయణిస్తున్నామని చెబుతూ వందల ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని ప్రధాని వెల్లడించారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన, రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్‌-2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వికసిత్ రాష్ట్రాలు, వికసిత్ భారత్‌ను తీర్చిదిద్దుతాయని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ ఆఫ్ చేశారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మమతా బెనర్జీ మాట్లాడేందుకు తగిన మాట్లాడే అవకాశం ఇచ్చారని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఎక్స్​లో తెలిపింది. ‘అక్షర క్రమంలో వెళ్తే మమతా బెనర్జీకి మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రమే మాట్లాడే అవకాశం దక్కేది. అయితే సీఎం నుంచి అధికారిక అభ్యర్థన మేరకు ఆమెకు ఏడో స్పీకర్​గా మాట్లాడే అవకాశం ఇచ్చారు’ అని పేర్కొంది.

అలాగే నీతి ఆయోగ్ సమావేశం​లో మైక్ ఆఫ్ చేశారని మమత చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడటానికి తగిన సమయం కేటాయించామని వెల్లడించారు.

“నీతి ఆయోగ్ సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. సమావేశంలో ఉన్నవారంతా ఆమె మాటలను విన్నాం. సమావేశానికి హాజరైన ప్రతి సీఎంకు నిర్ణీత సమయం కేటాయించాం. ప్రతి టేబుల్‌ ముందు ఉన్న స్క్రీన్​పై వారికి కేటాయించిన టైమ్ ఉంది. తన మైక్​ను ఆఫ్ చేశారని మీడియాతో మమత చెప్పారు. అది పూర్తిగా అబద్ధం. మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.” అని కేంద్ర ఆర్థిక మంత్రి విచారం వ్యక్తం చేశారు.