ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. సవరించిన స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచినట్టు ఎన్టీఏ అధికారులు తెలిపారు. అర్హత సాధించిన వారి సంఖ్య, కటాఫ్‌లో స్పల్పంగా తగ్గుదల నమోదైంది.
నీట్ టాప్ ర్యాంకర్లుగా చివరికి 17 మంది మాత్రమే మిగిలారు. గతంలో 67 మందిని నీట్ టాపర్లుగా ఎన్‌టిఎ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఫలితాలు సవరించిన తర్వాత టాప్ ర్యాంకర్లు సాధించిన వారి సంఖ్య 61 నుంచి 17కు తగ్గింది. వీరిలో నలుగురు బాలికలు ఉన్నారు.
ఈ 17 మంది 720కు 720 మార్కులు పొందగా, ఆరుగురు 716, 77 మంది 715 మార్కులు పొందారు. టాపర్లలో రాజస్థాన్‌లో నలుగురు, మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, యూపీలో ఇద్దరు, బీహార్, బెంగాల్, పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరందరూ 99.9992714 పర్సంటైల్‌తో మొదటి ర్యాంక్ సాధించారు.తొలుత వెల్లడించిన ఫలితాలలో 67 మంది టాప్ ర్యాంకులు పొందగా, తర్వాత పరీక్ష హాల్‌లో కొందరు విద్యార్థులు పూర్తి సమయం వినియోగించుకోలేదన్న కారణంతో కొందరికి ఇచ్చిన గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించడంతో టాపర్ల సంఖ్య ఆరు తగ్గి 61కు చేరింది.
భౌతిక శాస్త్రంలో అస్పష్టమైన ఒక ప్రశ్నకు సంబంధించి రెండు సమాధానాలు సరైనవని ఎన్టీఏ పేర్కొనగా, దానిపై నిపుణుల కమిటీ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ ప్రశ్నకు నాలుగో ఆప్షన్ ఒక్కటే సరైనదని కమిటీ తెలపడంతో, దానిని పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలు విడుదల చేయాలని ఎన్టీఏను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సవరించిన తుది ఫలితాలను విడుదల చేశారు.
నీట్‌లో అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు రీ టెస్ట్ జరపాల్సిన అవసరం లేదని, అక్రమాలు కొన్ని సెంటర్లకే పరిమితమయ్యాయని స్పష్టం చేస్తూ తీర్పు చెప్పింది. నీట్ పరీక్ష మే 5న జరుగగా, జూన్ 4న ఫలితాలు వెల్లడించారు. తర్వాత పరిణామాలలో జూలై 1న మరోసారి ఫలితాలు ప్రకటించారు. కోర్టు ఆదేశాలు, ఇతర సవాళ్లు అనంతరం తుది ఫలితాలను శుక్రవారం వెల్లడించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్