
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం నుంచి పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. తనను మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సమావేశం నుంచి బయటకు వచ్చారు. ఎన్డీఏ కూటమిలోని నాయకులకు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు మాత్రం ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.
‘కేంద్ర బడ్జెట్‌లో బంగాల్పై వివక్ష చూపారని, రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ మాట్లాడటం ప్రారంభించగానే వారు నా మైక్‌ను ఆప్ చేశారు. నన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించాను. విపక్షాల పార్టీల రాష్ట్రాల నుంచి హాజరైంది నేను ఒక్కదాన్నే. నన్ను కూడా మాట్లాడకుండా వారు ఆపేశారు’ అంటూ ఆమె ఆరోపించారు.
మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు తనకు తగిన సమయం ఇవ్వకపోవడం అవమానించడమే అవుతుందని ఆమె విమర్శించారు. ఈ చర్య అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడం కిందికే వస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
అయితే, ఆమె ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారవేసింది. ఆమె ప్రసంగ సమయం ముగిసిన్నట్లు మాత్రమే వాచ్ తెలిపిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అక్షరక్రమం ప్రకారం ఆమె మధ్యాన్నం భోజనం తర్వాత మాట్లాడవలసి ఉంది. అయితే ఆమె తొందరగా కలకత్తాకు తిరిగివెళ్ళాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరడంతో భోజనానికి ముందే ప్రసంగించే అవకాశం కల్పించారు.
విపక్షాలకు చెందిన కొందరు బాయ్‌కాట్ చేయడానికే ఈ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని ఓ వేదికగా మార్చకున్నారని బీజేపీ ఆరోపించింది. అదంతా ఓ డ్రామా అని ధ్వజమెత్తారు. బిజెపి రాజ్యసభ ఎంపి సమిక్ భట్టాచార్య బెనర్జీ సిద్ధం చేసిన “బలహీనమైన స్క్రిప్ట్” అని ఎద్దేవా చేశారు.” నీతి ఆయోగ్ సమావేశంలో ఆమెకు సరైన సమయంకు అనుమతించారు. ఆమె పశ్చిమ బెంగాల్ ప్రజల ఆర్థిక ప్రయోజనం కోసం సమావేశానికి వెళ్లలేదు. రాజకీయ ప్రయోజనాలకోసం వాకౌట్ చేయడం ద్వారా నాటకం వేసేందుకు వెళ్లారు,” అని మండిపడ్డారు. ఆమె ఓ పరిపాలకురాలిగా కాకుండా తనను తాను ఓ ప్రతిపక్ష నాయకురాలిగా చిత్రించుకుందని చెప్పారు.
కాగా,ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన జేడీయూ అగ్రనేత, బిహార్ ముఖ్యమంత్రి నీతిశ్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన తనకు బదులుగా ఉపముఖ్యమంత్రులను పంపించారు. ఇక ఈ భేటీని విపక్ష పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ బహిష్కరించారు ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, భగవంత్ మాన్, సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఉన్నారు. తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో శనివారం నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రధాన అజెండా 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి ఏర్పాటు చేశారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు